- District News
- Khammam
- భాజపా టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ
భాజపా టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ
ఖమ్మం, సెప్టెంబర్ 21: లోకల్ గైడ్:
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, రాజనీతి శాస్త్ర ఉపాధ్యాయుడు డాక్టర్ నెల్లూరి బెనర్జీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర టీచర్స్ సెల్ కన్వీనర్ కొంజెర్ల శ్రీనివాస్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలలో చురుగ్గా పనిచేసిన డా. బెనర్జీ, ఆ తర్వాత యువమోర్చాతో పాటు పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. గతంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, విద్యా రంగంలో ఆయనకున్న అనుభవాన్ని గుర్తించి పార్టీ ఈ బాధ్యతలను అప్పగించింది.
తన నియామకం పట్ల డాక్టర్ నెల్లూరి బెనర్జీ స్పందిస్తూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయానికి, టీచర్ సెల్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న డాక్టర్ బెనర్జీకి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించడం పట్ల బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
