- District News
- Khammam
- సింగరేణి సహా 3 ఆరోగ్య కేంద్రాలకు ఉన్నతీకరణ డిమాండ్
సింగరేణి సహా 3 ఆరోగ్య కేంద్రాలకు ఉన్నతీకరణ డిమాండ్
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి.. మంత్రి దామోదర రాజనరసింహను కలిసి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
!
కారేపల్లి (సింగరేణి ) , సెప్టెంబర్ 8, లోకల్ గైడ్ న్యూస్ :
వైరా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని సింగరేణి, ఏన్కూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను ఎమ్మెల్యే కలిశారు. అసెంబ్లీ మంత్రుల గదిలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా వైద్య సిబ్బంది, మెరుగైన మౌలిక వసతులు, అవసరమైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ నియోజకవర్గంలో వైద్య మౌలిక వసతుల బలోపేతానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే సింగరేణి, ఏన్కూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉన్నతీకరణకు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.
నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ప్రజారోగ్యంపై ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధను ప్రతిబింబిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.
