- District News
- Khammam
- గణనాథుడి కొలువుతో గేట్ కారేపల్లిలో పండుగ శోభ
గణనాథుడి కొలువుతో గేట్ కారేపల్లిలో పండుగ శోభ
వినాయక నవరాత్రులకు ఘనంగా శ్రీకారం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 14 (లోకల్ గైడ్ న్యూస్) :
గేట్ కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి కొలువుతో గేట్ కారేపల్లిలో పండుగ శోభ సంతరించుకుంది.
గ్రామానికి చెందిన గుజ్జర్లపూడి వెంకటేశ్వర్లు–శ్రీదేవి దంపతులు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీకి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ యువ నాయకులు గుడిపూడి తిరుమల రావు కార్యక్రమానికి హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, సిరిసంపదలు సమృద్ధిగా చేకూరాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, చిన్నారుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు.
గణనాథుడి ప్రతిష్ఠతో గేట్ కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో సందడి నెలకొంది. నవరాత్రుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
