- District News
- Khammam
- మాదారం రామాలయంలో ఘనంగా సామూహిక సీమంతాం వేడుకలు
మాదారం రామాలయంలో ఘనంగా సామూహిక సీమంతాం వేడుకలు
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్

మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని రామాలయంలో సోమవారం గర్భిణులకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ అనంతమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాదారం సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గర్భిణులకు సీమంతం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ మాట్లాడుతూ గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. గర్భధారణ సమయంలో తల్లి, శిశువు ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారం తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. రక్తహీనత, నీరసం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తగిన విశ్రాంతి తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, వైద్యుల సూచనల మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. తల్లి, శిశువు ఆరోగ్యానికి అవసరమైన సేవలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. గర్భిణుల ఆరోగ్యం విషయంలో అంగన్వాడీ సిబ్బంది, కుటుంబ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సూచనలు అందేలా అంగన్వాడీ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.
