- District News
- Khammam
- భీక్య తండలో ఘనంగా తీజ్ వేడుకలు
భీక్య తండలో ఘనంగా తీజ్ వేడుకలు
గిరిజన సంప్రదాయాలను ప్రభుత్వాలు కొనసాగించాలి
కారేపల్లి : లోకల్ గైడ్ న్యూస్, ఆగష్టు 30 :
కారేపల్లి మండల పరిధిలోని భీక్య తండ గ్రామంలో తీజ్ వేడుకలను ఆదివారం గిరిజనులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు కొనసాగిన తీజ్ ఉత్సవాల్లో గిరిజన యువతులు సంప్రదాయబద్ధంగా పాల్గొని వేడుకలను నిర్వహించగా, చివరి రోజు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న పాల్గొని మాట్లాడారు. గిరిజనుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను గ్రామాల్లో కొనసాగించేలా ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోత్సహించాలని కోరారు. గిరిజనుల ఓట్లతో గెలుస్తున్న పాలకులు గిరిజనుల పట్ల వివక్ష చూపకుండా వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. తొమ్మిది రోజులపాటు గిరిజన యువతులు తీజ్ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని అజ్మీరా వీరన్న పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ పండుగలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
