- District News
- Khammam
- గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు!
గంగారం తండా సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదుతో కదిలిన హరీశ్‌రావు!
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘనపై కలెక్టర్‌కు లేఖ.. విచారణ జరిపి అక్రమ కేటాయింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి
కారేపల్లి, నవంబర్ 6 (లోకల్ గైడ్ న్యూస్):
సింగరేణి మండలం గంగారం తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఆమోదం లేకుండానే ఇళ్ల కేటాయింపులు చేపడుతున్నారంటూ గంగారం తండా సర్పంచ్ ఎన్. కిరణ్‌కుమార్ చేసిన ఫిర్యాదుపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు స్పందించారు.
సర్పంచ్ సమర్పించిన వినతిపత్రాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు పంపిస్తూ నవంబర్ 5న అధికారికంగా లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జీవో ఎంఎస్ నెం.33 మార్గదర్శకాలను పాటించడం లేదని, సంబంధిత అధికారుల తీరుతో గ్రామస్థాయి ఇందిరమ్మ కమిటీల ప్రాధాన్యతను పక్కనపెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇళ్ల కేటాయింపులు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కనీస సమాచారం లేకుండా, వారి ఆమోదం తీసుకోకుండానే జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని హరీశ్‌రావు తన లేఖలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కేటాయింపులను తక్షణమే నిలిపివేసేలా సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు జీవో నెం.33 ప్రకారం పారదర్శకంగా జరగాలని, ప్రతి దశలోనూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.
సర్పంచ్ కిరణ్‌కుమార్ ఫిర్యాదును ఎమ్మెల్యే హరీశ్‌రావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో గంగారం తండాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆరోపణలపై జిల్లా యంత్రాంగం ఎలాంటి విచారణ చేపడుతుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
