కార్మిక–రైతు డిమాండ్లపై కదనభేరి.. నేడు కారేపల్లిలో జైల్‌భరో!

ఉపాధి హామీ బలోపేతం.. రూ.600 కూలీ.. రైతులకు మద్దతు ధర.. కార్మిక హక్కుల పరిరక్షణకు డిమాండ్

Published On
కార్మిక–రైతు డిమాండ్లపై కదనభేరి.. నేడు కారేపల్లిలో జైల్‌భరో!

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఆగష్టు 9 :

కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నేడు ఆగస్టు 10న ఉదయం 9 గంటలకు కారేపల్లి మండల కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘాల సింగరేణి మండల కమిటీ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని, ఉపాధి హామీ కూలీని రోజుకు రూ.600కు పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు.
అదేవిధంగా పాడి సాగుదారులు, భూమిపై ఆధారపడి జీవిస్తున్న పేదలకు హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులకు మద్దతు ధర కల్పించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కోరారు. రైతులపై పెరుగుతున్న పెట్టుబడి భారాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించడంతో పాటు కార్మిక హక్కులను పరిరక్షించాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న జైల్‌భరో కార్యక్రమానికి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల సింగరేణి మండల కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు కారేపల్లి మండల కేంద్రంలో జరిగే కార్యక్రమంలో ఐక్యంగా పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు.

Tags:

About The Author

Latest News