- District News
- Khammam
- కుల, మత, రాజకీయాలకు అతీతంగా.. ప్రజాసేవే ధ్యేయం!
కుల, మత, రాజకీయాలకు అతీతంగా.. ప్రజాసేవే ధ్యేయం!
రాధా రంగా మిత్ర మండలి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షరీఫ్ రంగా
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 10 :
హైదరాబాద్‌లో నిర్వహించిన ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన షేక్ షరీఫ్ పాషా (షరీఫ్ రంగా) పాల్గొన్నారు.
రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ షరీఫ్ పాషా (షరీఫ్ రంగా) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి నియామక పత్రాన్ని షరీఫ్ రంగాకు అందజేశారు. అనంతరం వంగవీటి వారసులు, వంగవీటి శాంతన్ కుమార్ తనయుడు వంగవీటి జూనియర్ మోహన రంగా షరీఫ్ రంగాను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా షరీఫ్ రంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జితో పాటు ట్రస్ట్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన పదవికి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని అన్నారు.
కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా ట్రస్ట్ సేవలను ప్రజలకు చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని షరీఫ్ రంగా స్పష్టం చేశారు. ట్రస్ట్ నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపడతానని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ట్రస్ట్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, నిరుపేదలు, ఆపదలో ఉన్నవారు, అవసరమైన వారికి అండగా నిలిచేలా తన వంతు కృషి చేస్తానని షరీఫ్ రంగా పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన షరీఫ్ రంగాకు పలువురు ట్రస్ట్ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
