- District News
- జల్ జమీన్ జంగిల్‌పై సర్వహక్కులు గిరిజనులకే దక్కాలి
జల్ జమీన్ జంగిల్‌పై సర్వహక్కులు గిరిజనులకే దక్కాలి
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పిలుపు
Published On
By Ram Reddy
......
ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అటవీ సంపద పరిరక్షణే ధ్యేయంగా పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కంగాల కల్లయ్య పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త కావడిగుండ్ల గ్రామంలో ఆదివారం గిరిజనులతో కలిసి ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కంగాల కల్లయ్య మాట్లాడుతూ, ప్రకృతితో మమేకమై జీవిస్తున్న గిరిజనులు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లేయుల పాలన కాలం నుండి నేటివరకు ఆదివాసీల జీవనోపాధి, సంస్కృతిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ వారి బతుకుల్లో వెలుగులు నిండలేదని పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం అంటే కేవలం జాతరలు, వేడుకలకే పరిమితం కాదని, హక్కుల సాధన కోసం పాలకులను నిలదీస్తూ పోరాట ప్రతిన బూనే దినమని స్పష్టం చేశారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న అర్హులైన గిరిజనులందరికీ తక్షణమే సంపూర్ణ స్థాయిలో హక్కు పత్రాలు అందజేయాలని, రైతులకు వర్తించే అన్ని రకాల వ్యవసాయ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజన రైతులకు కూడా వర్తింపజేయాలని, గిరిజన ప్రాంతాల్లో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ మరియు పీసా చట్టాన్ని యథాతథంగా, పకడ్బందీగా అమలు చేయాలని, ఆదివాసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను 100 శాతం వారికే కేటాయించాలని, ఆదివాసీ ప్రాంతాలను స్వయం పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని, భూమి కోసం సాగు చేసుకుంటున్న గిరిజనులపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేసి, అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలకు స్వస్తి పలకాలని, అడవులను విధ్వంసం చేసే ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధానాలను రద్దు చేయాలి. ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు, స్మగ్లర్లకు కట్టబెట్టే ధోరణిని ప్రభుత్వాలు వీడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కొమరం చిన్న లక్ష్మి, వాసం పోతురాజు, కంగాల వెంకటేష్, సోడెం పౌల్ రాజు, కొమరం పరమేష్, కొమరం సింగమ్మ, కణితి పెద్ద జోగారావు, కంగాల పెద్ద వంగరావు, కొమరం భీమరాజు, ముయబోయి కృష్ణ, కోవ్వాసి పొట్టి, మడకం రాజు, జెడ్డి రాయుడుతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Aug 2026 09:26:55
సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తా.. బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానని వెల్లడి
