- District News
- Khammam
- మాదారం సర్పంచ్ 16 నెలల వేతనం.. దేవాలయాలకు దానం!
మాదారం సర్పంచ్ 16 నెలల వేతనం.. దేవాలయాలకు దానం!
వినాయక ఉత్సవాలకు రూ.1.05 లక్షల సాయం.. సర్పంచ్ ఉమా నరేష్ సంచలన నిర్ణయం

పదవి అంటే హోదా మాత్రమే కాదని.. ప్రజా సేవకు ఒక బాధ్యత అని చాటుతూ మాదారం సర్పంచ్ ఉమా నరేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు సర్పంచ్‌గా వచ్చే గౌరవ వేతనాన్ని దేవాలయాల అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటివరకు వచ్చిన గౌరవ వేతనంతో పాటు ఇకపై వచ్చే 16 నెలల గౌరవ వేతనాన్ని సైతం విరాళంగా ప్రకటించారు. మాదారం గ్రామపంచాయతీ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ వినాయక విగ్రహాలు, దేవాలయాల అభివృద్ధికి సుమారు రూ.1.05 లక్షల ఆర్థిక సహాయాన్ని ఉమా నరేష్ అందించారు. ఎస్టీ కాలనీ రామాలయంలో వినాయక యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయ అభివృద్ధికి రూ.20 వేలు, వినాయక విగ్రహానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఎస్టీ కాలనీ తండాలోని ప్రతి కుటుంబంలోని మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేశారు. బీసీ కాలనీలోని వినాయక విగ్రహానికి రూ.5 వేలు, ఎస్టీ కోయ కాలనీలోని విగ్రహానికి రూ.5 వేలు, గోవిందతండా వినాయక విగ్రహానికి రూ.5 వేలు అందించారు. మాదారం గ్రామంలోని ఇతర వినాయక ఉత్సవ కమిటీలకు కూడా తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు.
గౌరవ వేతనం కూడా ప్రజలకే..
సర్పంచ్‌గా తనకు నెలకు రూ.6,500 చొప్పున వచ్చే గౌరవ వేతనాన్ని వ్యక్తిగత అవసరాలకు కాకుండా గ్రామంలోని దేవాలయాల అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు ఉమా నరేష్ తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన మొత్తంతో పాటు ఇకపై వచ్చే 16 నెలల గౌరవ వేతనాన్ని కూడా ఇదే విధంగా వినియోగించనున్నట్లు ప్రకటించారు.
ఎనిమిది నెలల్లో అభివృద్ధికి భారీ నిధులు
సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే మాదారం గ్రామానికి పలు కీలక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించినట్లు ఉమా నరేష్ తెలిపారు. రూ.3.20 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.20 లక్షలతో డ్రైనేజీ, రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో మహిళా భవనం నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. అదనంగా 30 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తయితే మాదారం పరిధిలోని పలు గ్రామాలు, తండాలకు విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం
మాదారం గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సహకారం అందిస్తున్నారని ఉమా నరేష్ తెలిపారు. వారి సహకారంతో గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. సర్పంచ్ భర్త నరేష్ గత ప్రభుత్వ హయాంలో మూడుసార్లు ఉత్తమ సర్పంచ్ అవార్డులు అందుకున్నట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా గ్రామాభివృద్ధి, సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలు మంగ, వార్డు సభ్యులు అజ్మీర శారద, అజ్మీర రజిని, అజ్మీర బాలాజీ, పాయం మునిందర్, వంకుడోతు భారతి, బానోత్ సౌందర్య, నగేష్, వినాయక యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కాసాని లక్ష్మీనారాయణ, కిలారి అప్పారావు, కిలారి వెంకటేశ్వర్లు, గుర్రం నరసింహారావు, తుమ్మోజు రామ్మూర్తి, చిన్న సైదయ్య, అజ్మీర రవి, అజ్మీర మోతిలాల్, సహదేవ్, రవి, జి.కిట్టు, బానోత్ కోటేశ్వరరావు, పునేం ఎర్రయ్య, తిరుమలగిరి నరేష్, బట్టు నరసయ్య, కె.శ్రీనివాస్ రావు, బడ్ల చారి, రావుల నాగేశ్వరరావు, దుప్పటి గోవిందు, ఏనుగు శివయ్య, గౌరీ తదితరులు పాల్గొన్నారు.
