- District News
- Khammam
- ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా చైతన్యమే ఆయుధం
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా చైతన్యమే ఆయుధం
మోదీ పాలనలో కార్పొరేట్లకు వరాలు.. రైతులకు కన్నీళ్లే మిగిలాయి
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి):లోకల్ గైడ్, ఆగస్టు 10 : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ మార్పు అత్యవసరమని సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర సోమవారం సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది. మాదారం, కారేపల్లి, కారేపల్లి క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దండి సురేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టకుండా, సామాన్యులపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని ఆరోపించారు.
రైతులకు రుణమాఫీ లేదు.. కార్పొరేట్లకు వేల కోట్ల మాఫీ:
రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందని సురేష్ విమర్శించారు. ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పెట్టుబడుల ధరలు భారీగా పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రైతుల రుణాలను మాత్రం పట్టించుకోకపోవడం వివక్షకు నిదర్శనమన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘జై శ్రీరామ్’ అంటూ.. రాముడి నిధులకే టోకరా:
అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాలు, నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేస్తోందని సురేష్ అన్నారు. “జై శ్రీరామ్ అంటూ రాముడి పేరును రాజకీయంగా ఉపయోగించుకుంటూ.. చివరకు శ్రీరాముడి నిధులకే టోకరా వేయడం దారుణం” అని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయని, సామాన్య ప్రజలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలు విస్మరించబడుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసి మిగిలిన హామీలను విస్మరించిందని దండి సురేష్ విమర్శించారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో సఫలం కాలేదని ఆరోపించారు. రుణమాఫీ అర్హత ఉన్న ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరక్షరాస్యులైన రైతులకు యాప్‌ల ఆధారంగా ఎరువుల పంపిణీ చేయడం ఇబ్బందికరంగా మారిందని, మార్కెట్‌లో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం ఏది?
ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం లోపించిందని సురేష్ అన్నారు. సామాన్య ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మంత్రులు, అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. దేశంలో అనేక చారిత్రక పోరాటాల ద్వారా ప్రజల హక్కులు, సంక్షేమ పథకాలు సాధించడంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సీపీఐ నిరంతరం డిమాండ్ చేస్తోందన్నారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వాలు ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యార్రబాబు, ఏపూరి లత తదితరులు ప్రసంగించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు అజ్మీర్ రామ్మూర్తి, రావి శివరామకృష్ణ, పోటు కళావతి, సీహెచ్. సీతామహాలక్ష్మి, యంగళ ఆనందరావు, జిల్లా నాయకులు శ్రావణ్, తాటి నిర్మల, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, తాతా వెంకటేశ్వర్లు, వీరునాయక్, ఉంగరాల సుధాకర్‌రావు, చెన్నంశెట్టి భూసయ్య, దల్‌సింగ్, పుచ్చకాయల శ్రీను, బట్టు సంగయ్య, బొమ్మల కృష్ణ, రాయల రామారావు, అమ్మర్ జానీ తదితరులు పాల్గొన్నారు. మాదారం మాజీ సర్పంచ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు జన చైతన్య యాత్రకు సంఘీభావం తెలిపారు.
