- District News
- Khammam
- ఖమ్మం పర్యాటక రంగానికి మకుటంలా.. ఖిల్లా రోప్‌వే!
ఖమ్మం పర్యాటక రంగానికి మకుటంలా.. ఖిల్లా రోప్‌వే!
వెయ్యేళ్ల చరిత్రకు నవశకం.. రోప్‌వేతో ఖమ్మం ఖిల్లాకు కొత్త శోభ
ఖమ్మం, ఆగస్టు 23 (లోకల్ గైడ్):
వెయ్యేళ్లకు పైగా చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఖమ్మం ఖిల్లా ఇక పర్యాటక రంగంలో సరికొత్త ఆకర్షణగా రూపుదిద్దుకోనుంది. చారిత్రక ఖిల్లాపై రోప్‌వే నిర్మాణానికి రూపకల్పన చేసిన రాష్ట్ర మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు.. రోప్‌వే పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
వెయ్యేళ్ల చరిత్రకు నవశకం..
విశిష్ట నిర్మాణ శైలికి ఖిల్లా ప్రతీక
ఖమ్మం ఖిల్లా నిర్మాణంలో హిందూ శిల్పకళ, ఇస్లామిక్ టవర్లు, బౌద్ధ నిర్మాణ శైలుల సమ్మేళనం కనిపిస్తుంది. సుమారు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కోట గోడలు 40 నుంచి 80 అడుగుల ఎత్తు, 15 నుంచి 20 అడుగుల వెడల్పుతో నిర్మితమయ్యాయి. కోటకు మొత్తం పది ద్వారాలు ఉండగా.. పట్టర్ దర్వాజగా పిలిచే సింహద్వారం అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందింది. సుమారు 60 ఫిరంగులను మోహరించే సామర్థ్యం కలిగిన ఈ కోట నాటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
కోటలోని నీటి అవసరాల కోసం జాఫర్ దౌలా పాలనలో సుమారు 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో బావిని నిర్మించారు. రాతి మెట్లు, వాచ్ టవర్లు, సొరంగ మార్గాలు తదితర నిర్మాణాలు ఖిల్లా ప్రత్యేకతలను మరింత చాటుతున్నాయి.
ఎందరో పాలకుల పాలనకు సాక్ష్యం
కాకతీయుల అనంతరం ముసునూరి నాయకులు, మెట్టోల నాయకులు, సీతాబ్ ఖాన్‌గా ప్రసిద్ధి చెందిన సీతాపతి రాజు, కుతుబ్‌షాహీలు, శ్రీకృష్ణదేవరాయలు, అసఫ్‌జాహీల పాలనలను ఖమ్మం ఖిల్లా చూసింది. అనంతరం 1948లో భారత ప్రభుత్వ పాలనలోకి వచ్చింది. ఇలా అనేక రాజవంశాల పాలనకు సాక్ష్యంగా నిలిచిన ఖిల్లా నేటికీ చారిత్రక వైభవాన్ని చాటుతోంది.
ఖిల్లా అభివృద్ధికి మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ
ఖమ్మం ఖిల్లా ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడంతో పాటు పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఖమ్మం స్థానిక ఎమ్మెల్యేగా రోప్‌వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు
పర్యాటక రంగంలో తుమ్మల ముద్ర
ఖిల్లా రోప్‌వే నిర్మాణం పూర్తయితే ఖమ్మం పర్యాటక రంగానికి కొత్త ఊపిరి అందడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. చరిత్ర, వారసత్వం, ప్రకృతి అందాలను ఒకే వేదికపై ఆస్వాదించే అవకాశం పర్యాటకులకు లభించనుంది. ఖిల్లాపై రోప్‌వే నిర్మాణానికి చొరవ తీసుకున్న మంత్రి తుమ్మలపై పర్యాటక ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
