- District News
- Khammam
- ఆరు గ్యారంటీలకు అడ్రస్ ఏది..?
ఆరు గ్యారంటీలకు అడ్రస్ ఏది..?
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 4, లోకల్ గైడ్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలకు నేడు అడ్రస్ లేకుండా పోయిందని, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా బీఆర్‌ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి మండలం కారేపల్లి క్రాస్‌రోడ్డులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమరభేరి సమావేశంలో ఎమ్మెల్సీ తాత మధు, బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రజలు అడగకముందే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మేధావుల ఆలోచనతో, ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిందని, తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడు కేసీఆర్ అని నాయకులు అన్నారు. రైతు బిడ్డగా రైతుల కష్టాలు, సమస్యలను అర్థం చేసుకున్న కేసీఆర్.. తన పాలనలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కంటే భూముల విక్రయాలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బానోత్ మనీషా లక్ష్మీ మదన్‌లాల్, లాకావత్ గిరిబాబు, బానోత్ చంద్రావతి, పొట్ల శ్రీనివాస్‌రావు, కట్ట కృష్ణ, బాణాల శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీలు ముత్యాల సత్యనారాయణ, ఉనేం వీరేందర్, వాంకుడోత్ జగన్, అప్పారావు, దొంకేన రవీందర్, మాజీ సర్పంచ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు శంకర్, అజ్మీర రవి, అచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, తాత వెంకన్న, నాగరాజు, గౌసుద్దీన్, వికాస్, రాజేష్, మాజీ సర్పంచులు జర్పల హచ్చు, సక్రూ, మోహన్, జాల సాంబతో పాటు సింగరేణి మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
