ప్లాస్టిక్‌ కవర్ల వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడు?

వైరా లో మచ్చుకైనా కనిపించని క్లాత్ సంచుల వినియోగం

అధికారుల దాడులు.. అవగాహన కార్యక్రమాలు ఉన్నా మారని పరిస్థితి
Published On
ప్లాస్టిక్‌ కవర్ల వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడు?

 

 

 

 ఖమ్మం జిల్లా వైరా ఆగస్టు:31: లోకల్ గైడ్:

 ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన ఉన్నప్పటికీ ప్రజలు వాటిని విచ్చలవిడిగా వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం వంటి నగరాల్లో ప్లాస్టిక్ సంచులు వినియోగం తగ్గినా, వైరా లో మాత్రం డ్రైనేజీల ను ముంచెత్తుతున్నాయి, వైరా లో సగం డ్రైనేజ్ సమస్య ఈ ప్లాస్టిక్ సంచులతోనే  మార్కెట్లు, కిరాణా దుకాణాలు, కూరగాయల విక్రయ కేంద్రాల్లో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం సాధారణంగా మారింది.

ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ.. నిషేధిత కవర్లను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. అధికారులు రైడ్లు నిర్వహించిన సమయంలో కొంతకాలం కవర్ల వినియోగం తగ్గుతున్నా.. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది.

ఆరోగ్యానికి.. పర్యావరణానికి ముప్పు

ప్లాస్టిక్‌ కవర్లు భూమిలో త్వరగా కలిసిపోకపోవడంతో చెత్తగా పేరుకుపోతున్నాయి. కాలువల్లో పడేయడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. పశువులు వాటిని తినడం వల్ల వాటి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్చడం వల్ల వాతావరణంలోకి హానికరమైన పొగలు విడుదలయ్యే ప్రమాదం ఉంది.

ప్రత్యామ్నాయాల వైపు అడుగులు

ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా బట్ట సంచులు, జూట్‌ బ్యాగులు, కాగితపు సంచులు, పునర్వినియోగ సంచులు ఉపయోగించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఒకసారి ఉపయోగించి పడేసే కవర్లకు బదులుగా ఇంటి నుంచి సంచులు తీసుకెళ్లే అలవాటును ప్రజలు పెంపొందించుకోవాలని కోరుతున్నారు.

భవిష్యత్‌ తరాల కోసం మార్పు అవసరం

ప్లాస్టిక్‌ వినియోగం నేటి సమస్య మాత్రమే కాదని.. భవిష్యత్‌ తరాలపై కూడా దీని ప్రభావం పడే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల అమలుతో పాటు ప్రజల్లో బాధ్యతాయుతమైన వినియోగంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ‘ప్లాస్టిక్‌ వద్దు.. పర్యావరణమే ముద్దు’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:

About The Author

Latest News