- District News
- ఎన్నో ఏళ్ల నాటి సమస్యలు దశలవారీగా పరిష్కారం.
ఎన్నో ఏళ్ల నాటి సమస్యలు దశలవారీగా పరిష్కారం.
కోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు పనులు వేగవంతం. - పట్టణానికి రెండు పూటలా తాగునీరు అందించడమే లక్ష్యంగా
లోకల్ గైడ్ తాండూర్:
ఎన్నో ఏళ్ల నాటి పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ తాండూర్ అభివృద్ధికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి తెలిపారు. పట్టణ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సోమవారం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. కోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా
తాండూర్ పట్టణ ప్రజలకు రెండు పూటలా తాగునీరు అందించడమే లక్ష్యంగా మనోహర్ రెడ్డి కంకణం కట్టుకున్నారని నీరజ బాల్రెడ్డి అన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులు సమకూర్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల నీటి కష్టాలను తొలగించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏళ్ల తరబడి ప్రజలను వెంటాడుతున్న చిలకవాగు సమస్యను కూడా పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నామని చైర్‌పర్సన్ తెలిపారు. సమస్య తీవ్రతను గుర్తించి అవసరమైన చర్యలు చేపడుతున్నామని, దశలవారీగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలను పట్టించుకోకుండా ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని చెప్పారు.విమర్శలకు సమాధానం చెప్పడం కంటే అభివృద్ధి పనులతోనే ప్రజలకు సమాధానం ఇస్తాం. తాండూర్ అభివృద్ధే మా ఏజెండా. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టి పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం” అని నీరజ బాల్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖాసీం అలీ, టౌన్ అధ్యక్షుడు బాతుల నాగు, కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.
