- District News
- Ranga Reddy
- జిల్లాస్థాయిలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల.
జిల్లాస్థాయిలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల.
సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, మార్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి.
రంగారెడ్డి జిల్లా బ్యూరో, లోకల్ గైడ్
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ 2026న ముసాయిదా ఓటరు జాబితాను నేడు విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి తెలిపారు.
ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి అర్హత కలిగిన ఓటరు పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా మార్పులు, సవరణలు అవసరమైనా సెప్టెంబర్ 16, 2026లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో 24,12,652 మంది ఓటర్లు
ఆగస్టు 18, 2026 నాటికి జిల్లాలోని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం మొత్తం 24,12,652 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,12,381 మంది పురుషులు, 12,00,062 మంది మహిళలు, 209 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు:
- 48–ఇబ్రహీంపట్నం: 2,59,317
- 49–ఎల్.బి. నగర్: 3,37,919
- 50–మహేశ్వరం: 3,39,306
- 51–రాజేంద్రనగర్: 3,88,278
- 52–శేరిలింగంపల్లి: 4,43,544
- 53–చేవెళ్ల: 2,18,274
- 83–కల్వకుర్తి: 2,16,890
- 84–షాద్‌నగర్: 2,09,124
జిల్లాలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 4,43,544 మంది ఓటర్లు ఉండగా, ఆ తరువాత రాజేంద్రనగర్‌లో 3,88,278 మంది, మహేశ్వరంలో 3,39,306 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు పరిశీలించుకోవాలి
అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లు లేకుండా పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు సి. నారాయణ రెడ్డి తెలిపారు.
ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హత కలిగిన వ్యక్తులు, అలాగే ఓటరు వివరాల్లో మార్పులు లేదా సవరణలు కోరుకునే వారు నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు లేదా సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ముసాయిదా ఓటరు జాబితాపై అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తామని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆయన కోరారు.
