- District News
- హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
గిరిజన సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా విస్తృత కార్యక్రమాలు : పీవో బి. రాహుల్
-
భద్రాచలం : లోకల్ గైడ్ :
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలంలోని ఆదివాసీ గిరిజన భవన్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్యఅతిథిగా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివాసీ ఉద్యమ వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడవులు, వాగులు, వంకలు, ప్రకృతి సంపదను కాపాడుకుంటూ జీవిస్తున్న ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివాసీల జీవన విధానం, ప్రకృతితో వారి అనుబంధం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర, కొమరం భీమ్ వంటి ఆదివాసీ వీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గిరిజన సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యాభివృద్ధికి ఉద్దీపకం వర్క్‌బుక్స్, కెరీర్ గైడెన్స్, సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పైచదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చర్లలో ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. పేద గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యల పరిష్కారం, పట్టాల పంపిణీ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను పరిరక్షిస్తూ ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు, విద్యుత్, గృహ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి — ఐటీడీఏ పీవో బి. రాహుల్
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉద్దీపకం కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జీపీఎస్ పాఠశాలల్లో కొత్తగా సుమారు 800 మంది విద్యార్థులు చేరారని తెలిపారు. ఉద్దీపకం వర్క్‌బుక్-3 ద్వారా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టీఎల్‌ఎం మేళాలు, క్విజ్‌లు, ఏకపాత్రాభినయం, వేషధారణ, కవితా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోయ భాష అభివృద్ధికి ఐటీడీఏ ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాహుల్ తెలిపారు. గిరిజనులకు సంబంధించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలు, ఆహ్వాన పత్రాలను కోయ భాషలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాషపై అవగాహన పెంచుతున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం గ్రంథాలయాల అభివృద్ధి, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సుమారు 2 వేల మందికి వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నట్లు ఐటీడీఏ పీవో తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని సూచించారు. ట్రైబల్ మ్యూజియం, భద్రగిరి మార్ట్‌లకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. గిరిజనుల గట్టు, గోత్రాలు, కట్టుబాట్లు, ఇలవేల్పుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఆదివాసీ సంఘాల నాయకులు అంబేద్కర్ కూడలి సమీపంలోని ఆదివాసీ అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ గేయం ఆలపించి ప్రతిజ్ఞ చేశారు. ఆదివాసీ జెండాను ఆవిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఐటీడీఏ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. గిరిజన గ్రామాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని గిరిజన ఐక్య కార్యవేదిక కార్యాచరణ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఏవో సున్నం రాంబాబు, ఏసీఎంవో రమేష్, ఏటీడీవో రాధమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఆర్‌సీవో గురుకులం అరుణకుమారి, డీఎం జీసీసీ సమ్మయ్య, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ వేణు, డీఎస్‌వో ప్రభాకర్ రావు, మాజీ ఎంపీ మీడియం బాపూరావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణదొర, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
