విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమం.

అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు పోరాడాలి.

సిపిఐ (ఎం ) రాష్ట్ర కమిటీ సభ్యులుముదిరెడ్డి సుధాకర్ రెడ్డి.
Published On
విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమం.

 

 

 నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు మరో పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్‌ సంస్కరణలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28న జరిగిన ‘చలో అసెంబ్లీ’ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్‌ అమరవీరులు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు.నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో అమరవీరుల చిత్రపటాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆనాడు విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం ఫలితంగానే నేటికీ ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయని అన్నారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ వంటి నిర్ణయాలు ప్రజా ఉద్యమాల ఫలితమేనని ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆనాటి పోరాటంలో ముగ్గురు అమరులైనప్పటికీ, వారి త్యాగాలు విద్యుత్‌ రంగంలో ప్రజల హక్కుల పరిరక్షణకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు.విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వాలు ప్రయత్నించిన ప్రతిసారీ ప్రజా ఉద్యమాల ప్రభావం ప్రభుత్వాలపై ఉంటోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్‌ రంగంపై కేంద్రం మరింత నియంత్రణ సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సబ్సిడీలను పరిమితం చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో సామాన్యులు, రైతులపై తీవ్ర భారాలు పడే ప్రమాదం ఉందన్నారు.సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి. సలీం మాట్లాడుతూ ఆనాటి విద్యుత్‌ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామిలకు పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజా పోరాటాల కారణంగానే 26 ఏళ్లుగా విద్యుత్‌ భారాలు నియంత్రణలో ఉన్నాయని అన్నారు.నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ లోని రెండు విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు.విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఉద్యోగ భద్రతతోపాటు ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు.దేశవ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్‌ ప్రైవేటీకరణ, విద్యుత్‌ సంస్కరణల నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.“విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవడం కోసం పోరాడినప్పుడే విద్యుత్‌ అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది .కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం” అని సీపీఐ(ఎం) నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సయ్యద్ హాషం, పుచ్చకాయ నర్సిరెడ్డి, రాచమల్ల వెంకట్రెడ్డి, గిరిబాబు, సాదక్కలి, పంచలింగం, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News