- District News
- Nalgonda
- ఖైదీల హక్కులపై జిల్లా జైల్లో అవగాహన.
ఖైదీల హక్కులపై జిల్లా జైల్లో అవగాహన.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.
ఖైదీల హక్కులు, వారికి అందుబాటులో
ఉన్న ఉచిత న్యాయ సహాయ సేవలు, న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు నల్గొండ జిల్లా జైలులో “ఖైదీల హక్కులపై న్యాయ అవగాహన కార్యక్రమం” నిర్వహించారు. ఐ సి ఎఫ్ ఏ ఐ, లా స్కూల్, ఐ ఎఫ్ హెచ్ ఈ హైదరాబాద్‌కు చెందిన లీగల్ ఎయిడ్ సొసైటీ మరియు నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన సీనియర్ సివిల్ జడ్జి కమ్ సెక్రటరీ హిమబిందు గొల్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నూతనంగా జిల్లా డి ఎల్ ఎస్ ఏ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా జైలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ఖైదీలతో నేరుగా మాట్లాడి, వారి న్యాయపరమైన హక్కులు మరియు వారికి అందుబాటులో ఉన్న న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హిమబిందు గొల్ల మాట్లాడుతూ, ఖైదీగా ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తికి చట్టపరమైన హక్కులు ఉంటాయని, న్యాయం పొందేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదని పేర్కొన్నారు. న్యాయ సహాయం అవసరమైన ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు డి ఎల్ ఎస్ ఏ ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఖైదీలు తమ కేసుల పరిస్థితి, న్యాయ సహాయం అవసరం వంటి అంశాలపై సంబంధిత న్యాయ సేవల ద్వారా సహాయం పొందాలని సూచించారు. ఖైదీల హక్కుల పరిరక్షణతో పాటు వారిలో చట్టంపై అవగాహన పెంపొందించడం సమాజంలో న్యాయబద్ధతను బలోపేతం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్. భీమార్జున్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా జైలు సూపరింటెండెంట్
ఆనంద రావు కూన మాట్లాడుతూ, ఖైదీలలో న్యాయ అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. జైలులో ఖైదీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఇక్ఫాయ్ లా స్కూల్ డీన్ ప్రొఫెసర్ వై. ప్రతాప్ రెడ్డి స్వాగత ప్రసంగం అందించగా, లీగల్ ఎయిడ్ సొసైటీ కోఆర్డినేటర్ డా. ఎస్. కన్నన్ కృతజ్ఞతలు తెలిపారు. జైలర్లు బాలకృష్ణ , అచ్చయ్య సిబ్బంది వెంకటేశ్వర్లు, జనార్దన్,గడ్డికొప్పుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలకు న్యాయ హక్కులపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది.
