- District News
- Nizamabad
- లింగ నిర్ధారణ పరీక్షలపై ఉక్కుపాదం మోపాలి
లింగ నిర్ధారణ పరీక్షలపై ఉక్కుపాదం మోపాలి
కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 18 : పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేసేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ చేసి, గర్భవిచ్చిత్తికి పాల్పడడం క్షమించరాని నేరమని, ఇది ఎంతో శోచనీయమని అన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడే వారిని ఎంతమాత్రం ఉపెక్షించకుండా, బాధ్యులపై ఎం.టి.పి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం గర్భస్థపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లింగ నిర్ధారణ పరీక్షల నిరోధానికి చేపడుతున్న చర్యల విషయమై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుని నివేదికలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నామ్ కే వాస్తేగా సమావేశాలు నిర్వహించి తీర్మానాలు రాసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలపై క్షేత్ర స్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అన్నారు. జనన వివరాలను అనుసరిస్తూ ఆడ, మగ నిష్పత్తిలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు భావించాల్సి వస్తుందన్నారు. ఈ తరహ వ్యత్యాసం ఎక్కువగా నగరాలు, పట్టణ ప్రాంతాలలోనే కనిపిస్తోందని, దీనిని బట్టి గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచితే ఈ తరహా అమానవీయ ఘటనలకు ఆస్కారం ఉండదని సూచించారు. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా, వాటి అమలు సక్రమంగా లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇకపై జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగకుండా గట్టి నిఘా పెట్టాలని, నిబంధలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భం దాల్చిన నాటి నుండి గర్భిణీల వివరాలను పక్కాగా నమోదు చేయాలని, వారిలో ఎంతమందికి కాన్పు జరిగిందన్నది పరిశీలించాలన్నారు. గర్భం దాల్చిన మీదట కాన్పు జరగని కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తే, గర్భ నిర్ధారణ, గర్భ విచ్చిత్తి ఘటనలను గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని, తద్వారా ఈ చర్యలకు పాల్పడిన స్కానింగ్ సెంటర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్కాగా నిబంధనలు పాటించే స్కానింగ్ కేంద్రాలకే లైసెన్సులు రెన్యూవల్ చేయాలని ఆదేశించారు. పి.సి.పి.ఎన్.డి.టి, ఎం.టి.పీ చట్టాలను ఉల్లంఘించడం వల్ల సమాజంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నదని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. పుట్టబోయే శిశువు ఆడ, మగ ఎవరైనా సరే, అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, కమిటీ సభ్యులు ఎస్.సిద్దయ్య, బి.ఆంజనేయులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
