- District News
- Ranga Reddy
- కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ను అవమానించినందుకు తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో దళితులపై అన్యాయం జరిగిందని, దళితులను లారీలు ఎక్కించి చంపించిన ఘటనలు కూడా ఉన్నాయని రాయికల్ శ్రీనివాస్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితిలో అడుగడుగునా దొరల అహంకారం, దురహంకారం కనిపిస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కంటే రాజకీయ డ్రామాలకే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు సంస్కారహీనంగా మాట్లాడి, ముఖ్యమంత్రి సంస్కారంతో మాట్లాడాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కొత్త రాజకీయ నాటకాలకు తెరతీస్తున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించిన ఘటన దళిత సమాజాన్ని అవమానించినట్లేనని రాయికల్ శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు వెంటనే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను ఖండించి, స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన పట్టుబట్టారు..
