- District News
- Ranga Reddy
- చేగూరులో కానరాని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..!
చేగూరులో కానరాని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..!
మళ్లీ మళ్లీ మరిగిస్తున్న నూనెపై ఆరోపణలు.. టిఫిన్ నాణ్యతపై కస్టమర్ల అసంతృప్తి
లోకల్ గైడ్ తెలంగాణ /రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం చెగూరు గ్రామ శివారులో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న చౌరస్తా కహానీ హోటల్‌లో టిఫిన్ నాణ్యతపై కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పూరీ, వడ, బొండా తదితర టిఫిన్ పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్న నూనె నాణ్యతపై ఓ కస్టమర్ ప్రశ్నించగా, హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది.
కస్టమర్ ప్రశ్నకు స్పందిస్తూ “ఆయిల్ చేంజ్ చేస్తే ప్లేట్ పూరీ రూ.200.. వాడిన ఆయిల్ అయితే రూ.40” అంటూ నిర్వాహకుడు చెప్పినట్లు సమాచారం. ఈ సమాధానంపై కస్టమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలపై హోటల్ నిర్వాహకుడి పూర్తి వివరణ తెలియాల్సి ఉంది.
ఆహార నాణ్యతపై అనుమానాలు
హోటళ్లలో వంట నూనెను పదేపదే వినియోగించడం వల్ల ఆహార నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు, బాటసారులు ఎక్కువగా టిఫిన్ చేసే ప్రాంతాల్లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.
తక్కువ ధరకు టిఫిన్ అందించాలనే ఉద్దేశంతో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడుతున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడం హోటల్ నిర్వాహకుల బాధ్యత అని స్థానికులు పేర్కొంటున్నారు.
అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్
చెగూరు పరిసరాల్లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వంట నూనె నాణ్యత, ఆహార పదార్థాల తయారీ విధానం, పరిశుభ్రత, నిల్వ విధానం తదితర అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు.
ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత హోటళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
