- District News
- Ranga Reddy
- గణేష్ శోభయాత్ర జరిగే బాలాపూర్ నుంచి ఇంజన్ బౌలి వరకు రోడ్డును పరిశీలించిన రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్
గణేష్ శోభయాత్ర జరిగే బాలాపూర్ నుంచి ఇంజన్ బౌలి వరకు రోడ్డును పరిశీలించిన రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, అధికారుల బృందం
నిమజ్జనం జరిగే పత్తికుంట, పల్లె చెరువు, రాజన్న బావి, కిస్మత్ పూర్ మూసి, పీరంచెరువు ప్రాంతాల సందర్శన. గణేష్ నిమజ్జనోత్సవాలకు రూ. 10 కోట్లు మంజూరు.
రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ):
గణేష్ నిమజ్జనోత్సవాల ఊరేగింపు సాగే బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా మీదుగా ఇంజన్ బౌలి వరకు ఉన్న రహదారిని రోడ్డులో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, కరెంటు తీగెలను రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారుల బృందం పరిశీలించారు. నిమజ్జన ఊరేగింపు ర్యాలీ సందర్భంగా చేపట్టాల్సిన పనులు సకాలంలో చేయడానికి శనివారం ఈ ప్రాంతాల్లో పర్యటించారు. అదే విధంగా రాజన్న రాజన్న బావిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా రాజేంద్ర నగర్ లోని పల్లె చెరువు వద్ద క్రేన్ల ఏర్పాటు, విద్యుత్ లైట్ల ఏర్పాటు, గుర్రపు డెక్క తొలగింపు, ఊరేగింపుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం రాజేంద్రనగర్ హనుమాన్ నగర్ సమీపంలోని పత్తి కుంట ను సందర్శించారు. పత్తి కుంటలో వేల సంఖ్యలో వినాయక నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రేన్ ల ఏర్పాటుతో పాటు, విద్యుత్ లైట్లు, పారిశుధ్య నిర్వహణ బాగుండేలా చూడాలన్నారు. పీరం చెరువు, కిస్మత్ పూర్ మూసి వద్ద ఏర్పాటు చేయనున్న నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలించారు.
నిమజ్జనోత్సవాలకు రూ.10 కోట్ల తో పనులు:
రాజేంద్రనగర్ జోన్ పరిధిలో సెప్టెంబర్ 14న నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి, నిమజ్జనోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. క్రేన్లు , విద్యుత్ లైట్ల ఏర్పాటు, ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ పనులు గుర్రపు డెక్క తొలగించడం ఇలా వివిధ పనులను చేపట్టడానికి ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. నిమజ్జనం జరిగిన అనంతరం వ్యర్థాలను తొలగించడం జరుగుతుందన్నారు. నిమజ్జనం ఊరేగింపు సాగే ప్రధాన రహదారులతో పాటు బస్తీలు, కాలనీలలో కూడా రోడ్లను వేయడానికి మరో రూ. 10 కోట్ల పనులకు అనుమతులు తీసుకున్నామన్నారు.
చెరువు లలో గుర్రపు డెక్క ను తొలగిస్తున్నాం :
మీరాలం చెరువు తో పాటు బాలాపూర్ చెరువు, శివరాంపల్లి శిలాన్ చెరువు, పల్లె చెరువు లలో ఉన్న గుర్రపు డెక్క ను తొలగిస్తున్నాం అని జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో ఇంజనీరింగ్ విభాగం ఎస్ ఈ నరేందర్ గౌడ్, ఈ ఈ వెంకట శేషయ్య, డిప్యూటీ కమిషనర్ లు బి సురేందర్ రెడ్డి, పాపయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
