సిద్దిపేట, సెప్టెంబర్ 9(లోకల్ గైడ్):
రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, భూమిని నేషనల్ హైవే అధికారులకు త్వరితగతిన అప్పగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.గంగాధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ కె.హైమావతితో కలిసి నేషనల్ హైవే, రెవెన్యూ శాఖ అధికారులతో ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపట్టాయని తెలిపారు. జిల్లాలోని రాయపోల్, వర్గల్, మర్కుక్, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం జరగనున్నందున భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్బిట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ ద్వారా ఆయా ప్రాంతాల్లో కలిగే అభివృద్ధి, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో డ్రోన్ సర్వే నిర్వహించి, రైతులు కొత్తగా పంటలు సాగు చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వాధీనం చేసుకున్న భూమిని నిబంధనల ప్రకారం నేషనల్ హైవే అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం అప్పగించిన భూమి బాధ్యత పూర్తిగా నేషనల్ హైవే అథారిటీదేనని, భూముల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భూసేకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని గంగాధర్ ఆదేశించారు.సమావేశంలో ఆర్డీఓ చంద్రకళ, నేషనల్ హైవే అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.