మాతృభాషను గౌరవిస్తూ.. ఇతర భాషలపై పట్టు సాధించాలి.

తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడుకోవాలి.

కాళోజీ సేవలను స్మరించుకున్న ఆదర్శ పాఠశాల విద్యార్థులు.
Published On
మాతృభాషను గౌరవిస్తూ.. ఇతర భాషలపై పట్టు సాధించాలి.

లోకల్ గైడ్/బంట్వారం: 
మాతృభాష తెలుగుపై ప్రతి ఒక్కరూ అభిమానం, గౌరవం పెంపొందించుకోవాలని, అదే సమయంలో ఇతర భాషలపై కూడా పట్టు సాధించాలని బంట్వారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ బ్యూలా, తెలుగు ఉపాధ్యాయులు సూచించారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ భాష, యాస, సంస్కృతి ప్రాధాన్యతను తెలియజేస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ భాషకు ప్రత్యేకమైన యాస, పదజాలం, సంస్కృతి ఉన్నాయని ప్రిన్సిపల్‌ బ్యూలా పేర్కొన్నారు. తెలంగాణ భాషను, యాసను కేవలం మాట్లాడే విధానంగా కాకుండా మన సంస్కృతి, జీవన విధానానికి ప్రతిబింబంగా భావించాలని సూచించారు. ఆధునిక కాలంలో అనేక భాషలు నేర్చుకోవడం విద్యార్థులకు అవసరమే అయినప్పటికీ, మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనల ద్వారా సమాజం ముందుకు తీసుకువచ్చిన కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని ఉపాధ్యాయులు అన్నారు. ప్రజల భాషలో ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తూ ఆయన చేసిన సాహిత్య కృషి తెలంగాణ సమాజంపై చెరగని ముద్ర వేసిందన్నారు. కాళోజీ ఆశయాలను నేటి తరం విద్యార్థులు తెలుసుకుని, భాషా సంస్కృతుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మాతృభాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అభిమానం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో, పాఠశాలలో తెలుగును గౌరవంగా ఉపయోగిస్తూ, ఇతర భాషలను కూడా నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించవచ్చని తెలిపారు. తెలంగాణ భాషా దినోత్సవం వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో భాషాభిమానం, సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించారు.

Tags:

About The Author

Latest News