- District News
- నేడు శ్రీ అంబు రామేశ్వర జాతర.
నేడు శ్రీ అంబు రామేశ్వర జాతర.
తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా తరలిరానున్న భక్తులు
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి పరివాహక ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ అంబు రామేశ్వర స్వామి జాతర నేడు (శ్రావణ మాసం చివరి సోమవారం) వైభవంగా జరగనుంది. జాతరకు తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన అంబు రామేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా తాండూరు, వికారాబాద్, జహీరాబాద్, హైదరాబాద్ ప్రాంతాలతోపాటు కర్ణాటకలోని చించోళి, గుల్బర్గా, కుంచారం తదితర ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు హాజరవుతారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి రానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
జాతర సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలతోపాటు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
పటిష్ట బందోబస్తు.
జాతరకు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్లు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. ప్రతి ఏటా జాతర సందర్భంగా పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా
అంబు రామేశ్వర స్వామి జాతర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా ఆలయ కమిటీ, అధికారులు, పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.కాగా జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు, ఆలయ నిర్వాహకులకు సహకరించాలని కోరారు.
