విద్యార్థుల చేతుల్లో తెలంగాణ సంప్రదాయ వైభవం

కింగ్‌స్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

Published On
విద్యార్థుల చేతుల్లో తెలంగాణ సంప్రదాయ వైభవం

పొన్నాల, ఆగస్టు 11(లోకల్ గైడ్):

సిద్దిపేట జిల్లా పొన్నాలలోని కింగ్‌స్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, విలువలను ప్రతిబింబించేలా బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని పరిచయం చేసి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి బోనాలను తీసుకువచ్చారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థులే స్వయంగా బోనాలను తయారు చేసి సంప్రదాయబద్ధంగా అలంకరించారు. అనంతరం మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడంతో కళాశాల ప్రాంగణం భక్తి, ఉత్సాహంతో సందడిగా మారింది.కింగ్‌స్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో మైసమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించి గత 25 సంవత్సరాలుగా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, గౌరవాన్ని పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.సంస్కృతి–విలువలకు టీచర్ ఎడ్యుకేషన్‌లో ప్రాధాన్యం ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనంత రెడ్డి మాట్లాడుతూ.. సంప్రదాయాలను తెలుసుకున్న ఉపాధ్యాయులే విలువలతో కూడిన విద్యను అందించగలరని అన్నారు. కాబోయే ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, మానవీయ విలువలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బోనాల వంటి తెలంగాణ పండుగలను విద్యా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించడం ద్వారా విద్యార్థులు సంప్రదాయాలను స్వయంగా అనుభవించి, వాటి గొప్పతనాన్ని భావి తరాలకు పరిచయం చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు.“మన సంస్కృతి–మన సంప్రదాయం–మన బాధ్యత” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనంత రెడ్డి, సీనియర్ అధ్యాపకులు జైపాల్ రెడ్డి, మహేందర్, మనోహర్, నగేష్, శ్రీనివాస్ రెడ్డి, లైబ్రేరియన్ విజయ, అటెండర్ హేమలత, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News