భవిష్యత్తులో అగ్రస్థాన లక్ష్యంగా ముందుకు సాగాలి
- జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్
గద్వాల, లోకల్ గైడ్ :
నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో దేశవ్యాప్తంగా టాప్–5లో స్థానం స్థానం దక్కించుకున్న గట్టు బ్లాక్‌లో కృషి చేసిన అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో అగ్రస్థాన లక్ష్యంగా పెట్టుకుని మరింత ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ విడుదల చేసిన 2024–25 క్యూ4 డెల్టా ర్యాంకింగ్‌లో గట్టు బ్లాక్ దేశంలో 5వ స్థానం, జోన్–3లో 2వ స్థానాన్ని సాధించిందని తెలిపారు. ఈ విజయానికి గుర్తింపుగా గట్టు బ్లాక్‌కు నితి ఆయోగ్ నుంచి రూ.1 కోటి పురస్కారం దక్కిందని తెలిపారు. ఈ విజయం సాధించినందుకు గట్టు మండలంలోని అధికారులు, విభాగా ధిపతులు, ఫ్రంట్ లైన్ సిబ్బందిని అభినందిస్తూ, భవిష్యత్తులో 100శాతం కేపీఐ లక్ష్య సాధన కోసం ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ కు సహకరిస్తున్న ఎస్ బీఐ సంజీవని, భవిష్య భారత్, టీచ్ ఫర్ చేంజ్, ఎంవీ ఫౌండేషన్ వారిని అభినందించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి వంటి ఐదు కీలక రంగాలలో ఉన్న 39 పనితీరు సూచికలను సమర్థంగా నిర్వహిస్తూ, భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారింఛాలని అన్నారు. ప్రస్తుతం గట్టు బ్లాక్ కంపోజిట్ స్కోర్ 69.43గా ఉండగా,దీన్ని మరింత మెరుగుపరచి 100 శాతం లక్ష్య సాధనవైపు ముందుకు సాగేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, డిపిఒ నాగేంద్రం, జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప, జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఎంపిడిఒ చెన్నయ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ సంధ్య రాణి, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.