"కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక"
కేటీఆర్ ఘాటు విమర్శలు – పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా మారారా?బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. “ఒక ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసన తెలపాలన్న హక్కు కూడా లేకపోతే ఇది ఎలాంటి వ్యవస్థ?” అని ప్రశ్నించారు.
"తాము వేసుకున్నది ఖాకీ యూనిఫాం… కాంగ్రెస్ కండువా కాదు!"పోలీసులు పార్టీ తొత్తుల్లా వ్యవహరించకూడదని హెచ్చరిస్తూ, “తమకు వేసుకున్నది ఖాకీ యూనిఫాం – అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని గుర్తించాలి,” అని స్పష్టం చేశారు కేటీఆర్. ఇప్పటికైనా ఆలోచించి న్యాయాన్ని అనుసరించాలని సూచించారు.
సీతక్కపై నిప్పులు చెరిగిన కేటీఆర్
మంత్రి సీతక్క పై కూడా కేటీఆర్ మండిపడ్డారు. “ఇసుక అక్రమ రవాణా, గిరిజనులపై అణచివేత, చిన్నా పెద్దా అందరికీ తెలిసిన విషయాలే. సీతక్క తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చుక్క రమేశ్‌ను వేధింపులకు గురిచేసిన వాళ్లపై కేసులు పెట్టాలి. ఇది ఓ సామాన్య కార్యకర్త ప్రాణానికి కారణమైన ఘటన. మౌనంగా ఉండలేం,” అని అన్నారు.
"ఇంకా వెనకడుగు వేయం – పోరాటం కొనసాగుతుంది"
ములుగు జిల్లాలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే మరింత ఉగ్రంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. “ఇది ఒక్క వ్యక్తి సమస్య కాదు – ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం చేసే పోరాటం” అని కేటీఆర్ హచ్చరిస్తున్నారు.