తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు......
లోకల్ గైడ్:బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి మరియు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వచ్చే నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం, మంగళవారం రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడం జరిగే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.ప్రత్యేకంగా నేడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌లు జారీ చేసినట్లు సమాచారం. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు సుమారుగా ఐదు డిగ్రీల వరకు పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. అంచనా వేసిన సమయానికి ముందే ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ముందుగా మే 27న కేరళ తీరాన్ని తాకుతాయని భావించినా, తాజా అంచనాల ప్రకారం మే 24 నుంచే కేరళలో ప్రవేశించి, జూన్ మొదటి వారం నాటికి తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.