లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
నార్తాంప్టన్‌కు వెళ్లే డీవైడర్‌ను ఢీకొన్న కార్ – ఉజ్జ్వల్ రెడ్డి ఘటనాస్థలంలో మృతి, రిషిత్ రెడ్డి ఆసుపత్రిలో చనిపోయిన ఘటనపై తెలుగు కమ్యూనిటీ లో దిగ్భ్రాంతి
లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. ప్రమాదంలో మరణించిన వారు చందన ఉజ్జ్వల్ రెడ్డి (23), చందన రిషిత్ రెడ్డి (21)గా గుర్తించబడ్డారు. వీరు సోదరులు.
వీరి మృతికి కారణంగా వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన గురించి తెలిసిన తెలుగు కమ్యూనిటీ సభ్యులు, మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఉజ్జ్వల్ రెడ్డి గత 8 సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తున్నారు. అతను అక్కడ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. చందన రిషిత్ రెడ్డి విద్యార్థి. ఇటీవలే ఆయన చదువుల నిమిత్తం లండన్ వెళ్లారు.
పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, వేగం మితిమీరిందా? లేక ఇతర కారణాలా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
వీరి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటన వారి స్నేహితులు, బంధువుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది.