వరద ప్రమాద ప్రాంతాన్ని పరిశిలించిన ఎమ్మెల్సీలు
కామారెడ్డి లో పర్యటించిన ఎమ్మెల్సీల బృందం
కామారెడ్డి (లోకల్ గైడ్); ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడానికి ఎమ్మెల్సీల బృందం ఆదివారం కామారెడ్డి లో పర్యటించారు . కామారెడ్డి పట్టణములో వరదలతో అపార నష్టం వాటిల్లిన గురురాఘవేంద్ర కాలనిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు . నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదించి బాధితులకు సత్వర సహాయం అందేలా చొరవ తీసుకొంటామని ఎమ్మెల్సీలు వెల్లడించారు .
బిజెపి ఏంచేస్తోంది-ఎమ్మెల్సీ విజయశాంతి
కామారెడ్డిలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వ బీజేపీ ఏం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ , బల్మూరి వెంకట్‌లతో కలిసి ఆదివారం కామారెడ్డి పట్టణంలో పర్యటించారు .
పట్టణంలోని వరద ముంపునకు గురైన జీఆర్ కాలనీ , కౌండిన్య, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పర్యటించారు. జీఆర్ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరదలకు గల కారణాలపై ఆరా తీశారు. వరదతో తీవ్రంగా నష్టపోయామని బాధిత కుటుంబాలు ఎమ్మెల్సీల బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యాయి.
వరదల్లో సర్వం కోల్పోయామని, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడ్డామని భాదితులు వాపోయారు . తమ విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తడిసి ముద్దయ్యాయన్నారు. వరదల సమయంలో డాబాలు, ట్యాంకులపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని విజయశాంతి బాధిత కుటుంబాలను ఓదార్చారు. జీఆర్ కాలనీలో దాదాపు రెండు గంటల పాటు విజయశాంతి పర్యటించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను వరద నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న వసతులు, సహాయంపై ఆరా తీశారు.
పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం
అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వరద నష్టం కింద అత్యధిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని ఎమ్మెల్సీ విజయశాంతి ఆటలాడుతూ అన్నారు . 2018 ఎన్నికల సమయంలో కామారెడ్డికి ప్రచారం నిమిత్తం వచ్చానని, అప్పుడున్న కామారెడ్డి, ఇప్పుడున్న కామారెడ్డిని చూస్తే బాధేస్తుందని అన్నారు . ఒక్కో ఆడబిడ్డ వారి పరిస్థితి చెబుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. కాలనీ వాసుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఈ పరిణామం ఎవరూ ఉహించనిదని పేర్కొన్నారు. ప్రజల బాధ కళ్లారా చూశాక వారు అనుకున్న దానికన్నా ఎక్కువే ప్రభుత్వం ఇచ్చేలా చూస్తామన్నారు. ప్రజలు ఇంతలా అల్లాడుతుంటే బీజేపీ ఏం చేస్తోందని విజయశాంతి ప్రశ్నించారు.
కేంద్రం కూడా స్పందించాల్సింది
తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను ఇక్కడి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కేంద్రమే ముందుకు వచ్చి నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిందని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీ ప్రతినిధులను ప్రజలు గెలిపించింది జాలీగా కూర్చోవడానికి కాదని ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే తమకు ఇప్పటివరకు కనిపించలేదని కాలనీవాసులు చెబుతున్నారన్నారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ముందుకు రావాలి...
వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోడానికి సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం అందించాలని విజయశాంతి కోరారు .
బఫర్ జోన్‌పై విలేకరులు ప్రశ్నించగా గతంలో చేసిన తప్పుల వల్లే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయన్నారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలకు అతీతంగా వరద ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తలా ఒక చేయి వేయాలని కోరారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలని సూచించారు.
నష్టంపై నివేదిక ఇవ్వడానికే వచ్చాం
కామారెడ్డిలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఇక్కడి పరిస్థితులను పరిశీలించి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసమే తాము వచ్చామని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు అధికారులు చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు. తమ పార్టీ నాయకులు ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తుందన్నారు.
భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రజల్ని తప్పు పడతారా....
వరదల్లో ఇబ్బందులకు గురైన ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రజలనే తప్పు పడతారా అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. వరదల విషయంలో రాజకీయం చేయొద్దని సూచించారు . కానీ బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు తెరలేపాయన్నారు. ప్రజలను తప్పుపట్టేలా కామారెడ్డి ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. తాము ప్రజలకు ధైర్యం చెప్పడానికే వచ్చామని, వారికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
శాసన మండలిలో చర్చిస్తాం......
కామారెడ్డి వరద ఘటనపై ఛైర్మన్ అనుమతి తీసుకుని శాసన మండలిలో ప్రత్యేకంగా చర్చిస్తామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. కామారెడ్డికి ఇలాంటి పరిస్థితుల్లో తాము రావాల్సి వస్తుందని కలలో కూడా ఉహించలేదన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి లాస్ అసెస్మెంట్ కమిటి ఏర్పాటు చేసి అత్యధిక పరిహారం అందించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. కామారెడ్డిలో ఇద్దరు లెజెండ్లను కాదని వెంకట రమణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కామారెడ్డి ప్రజలనే ఆయన దోషులుగా చూపిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో ఆయనకు అత్యధిక ఓట్లు రాలేవా అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి , బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి కూడా వరద బాధితులను ఆడుకొనుటకు చొరవ చూపకపోవడం విడ్డురంగా ఉందని అన్నారు . ఎలాంటి వివక్ష చూపకుండా కేంద్రం నుండి తెలంగాణ కు అధిక నిధులు విడుదల చేయించి వరద బాధితులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు . కానీ కేంద్రాన్ని రూ.10వేల కోట్లు అడిగితే రూ.10 కోట్లు కూడా ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. గుజరాత్‌లోని సబర్మతి కడితే దానిపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తారని విమర్శించారు. గణపతి బొప్పా మోరియా కావాలయ్యా యూరియా అని మాట్లాడే బీఆర్ఎస్కు కామారెడ్డి వద్దా అని ప్రశ్నించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు గిరిజ షెట్కార్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, నాయకులు పాల్గొన్నారు
ముప్పు బాధితులకు తక్షణ సహాయం-జిల్లా కలెక్టర్
ఇదిలా ఉండగా జిల్లాలో కురిసిన ఆధిక వర్షాల వలన ముంపునకు గురైన కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీని ఆదివారం ఎమ్మెల్సీల బృందంతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించి బాధితులకు అందిస్తున్న సహకారాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరుసగా కురిసిన అధిక వర్షం వల్ల ముంపుకు గురైన జిఆర్ కాలనీ వాసులకు ఆహారం, త్రాగునీరు సరఫరా చేసి , వరద తగ్గుముఖం పట్టగానే కాలనీలో మౌలిక వాసతుల పునరుద్ధరణ కార్యక్రమాలను వేగంగా చేపట్టినట్లు వెల్లడించారు . కాలనీలో మొత్తం శానిటేషన్ కార్యక్రమాలు, విద్యుత్ పునరుద్ధరణ, త్రాగునీరు సరఫరా తదితర అత్యవసర కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహించి కాలనీలో పాక్షికంగా దెబ్బతిన్న 48 ఇండ్లకు ఒక ఇంటికి 11500 రూపాయలను తక్షణ సాయంగా అందించినట్లు కలెక్టర్ తెలిపారు . వాటితోపాటు దుప్పట్లు, నిత్యవసర సరుకులను అందజేసి జిఆర్ కాలనీని సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని వివరించారు . ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం కోసం జిల్లా అధికార యంత్రంగానికి ప్రభుత్వం అత్యధికంగా తోడ్పాటు అందించిందని తెలిపారు