జాతీయ రహదారి పై స్తంభించిన వాహనాలు
కామారెడ్డి (లోకల్ గైడ్); రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు కామారెడ్డిలో అల్లకల్లోలం సృష్టించాయి. చెరువులు, కుంటలు పొంగి పొర్లడంతో రోడ్లపైకి నీరు చేరి రహదారులు దెబ్బతిన్నాయి .
తాజాగా కామారెడ్డి 44 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టేక్రియాల్ నుంచి కామారెడ్డి, భిక్కనూరు మండలం జంగంపల్లి వరకు ఒకవైపు భారీగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. టేక్రియాల్ బైపాస్ వద్ద అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీళ్లు రోడ్డుపై పారడంతో రోడ్డు దెబ్బతింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకవైపు వాహనాలను పంపించి మరోవైపు వాహనాలను నిలిపివేశారు . దాంతో వాహనాలు వెళ్లడానికి గంటల కొద్దీ సమయం పట్టింది . స్థానిక పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు .

భారీ వర్షాలకు జాతీయ రహదారి రోడ్ల అక్కడక్కడా కొట్టుకుపోయాయి. టేక్రియాల్ చెరువు అలుగు పారడంతో బైపాస్ వద్ద రోడ్డు దెబ్బతింది. దాంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుప్రియాల్ వద్ద నీటి ప్రవాహంతో రోడ్డు దెబ్బతినడంతో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు .
క్యాసంపల్లి - జంగంపల్లి వద్ద ఎడ్లకట్ట వాగు ప్రవహంతో రోడ్లు తెగిపోయాయి. ఇప్పటికే జంగంపల్లి వద్ద మరమ్మతులు చేసి నాలుగు లైన్లలో రెండు లైన్లలో మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతించారు. రోడ్డు పునరుద్దరించినా కుంగిపోయినట్టు అధికారులు గుర్తించారు . దాంతో అటువైపుగా రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు .
టేక్రియాల్ వద్ద గండి పడిన ప్రదేశంలో మరమ్మతు పనులు చేపట్టారు . తాత్కాలికంగా పనులు పూర్తి చేసి ఒక్కొక్కటిగా వాహనాలను వరుస క్రమంలో పంపించారు . దింతో జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలు పునరుద్ధరణ మొదలైంది . వర్షాలు తగ్గు ముఖం పట్టినందున దెబ్బతిన్న రహదారి మార్గళ్ మరమత్తు పనులకు శ్రీకారం చుట్టారు