డ్రగ్స్ గంజాయి పై ఉక్కు పాదం
సూర్యాపేట ఎస్పీ నరసింహ చేతుల మీదుగా రివార్డు అందుకున్న ఐలయ్య
తుంగతుర్తి ప్రతినిధి (లోకల్ గైడ్); సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో నెలవారి క్రైమ్ మీటింగ్ నందు జిల్లాలో ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నాగారం ఎస్సై ఐలయ్య గారిని గుర్తించి , అతనిని అభినందించి ఎస్పీ వారి చేతుల మీదుగా రివార్డ్ అందుకున్న సందర్భంగా
మీడియా "చిట్ చాట్ "లో మామునూరి. ఐలయ్య
విలేకరులతో ఏడాది అనుభవాల షేరింగ్
గణేష్ ఉత్సవాలకు పటిష్ట వ్యూహం
సివిల్ వివాదాల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ.... క్రిమినల్ కేసుల్లో నిందితులకు కౌన్సిలింగ్ లు ఇస్తూ.... మరోవైపు ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తూ.... ఉన్నతాధికారుల సూచనల మేరకు నాగారం మండలంలో శాంతిని నెలకొల్పిన సూపర్ పోలీస్ , సబ్ ఇన్ స్పెక్టర్ మామునూరి. ఐలయ్య ఇక్కడ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండల విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఎస్ఐ: థాంక్యూ అండీ, దీనికి మా ఉన్నతాధికారులతో పాటు మీలాంటి బాధ్యతగల వ్యక్తుల సహకారం చాలా ఉంది.
విలేకరి : గతంతో పోలిస్తే ఏడాది కాలంలో నాగారం మండలంలో మీరు గమనించిన మార్పులు ఏంటి....!?
ఎస్ఐ: క్రైమ్ రేట్ బాగా తగ్గింది. ప్రజలకు పోలీసులు ఉన్నారనే భరోసా పెరిగింది. వివిధ అంశాలపై గ్రామాల్లో నిర్వహించిన "పోలీసు భరోసా సదస్సు"లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రజలు శాంతియుత జీవనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వచ్ఛందంగా పోలీసులకు సహకరిస్తున్నారు.
విలేకరి : ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటి...!? దాని మీరు ఎలా పరిష్కరించారు.....!?
ఎస్ఐ: నాగారం మండలంలో ఇసుక అక్రమ రవాణా ప్రధాన సమస్యగా ఉండేది. కొంత మంది యువకులు పూర్తిగా ఇసుక రవాణా పై ఆధారపడి చదువును, కెరీర్ ను నిర్లక్ష్యం చేశారు. అక్రమార్జనతో వ్యసనాలకు అలవాటు పడి , గొడవలు సృష్టించేవారు.
నేను బాధ్యతలు తీసుకోగానే ప్రభుత్వ పాలసీ ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాను.దీంతో పెడదోవ పట్టిన కొందరు ఉపాధి బాటపట్టారు. మరికొందరు చదువుపై దృష్టి సారించారు.
ఆటోమేటిక్ గా అనుబంధ సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి.
విలేకరి : రాజకీయ నాయకులు , పార్టీల వల్లే యువత పెడదారి పట్టిందంటారా...!?
ఎస్ఐ: అలాంటిదేమీ లేదు. ఏ రాజకీయ పార్టీ , ఏ నాయకుడు ఇలాంటి అక్రమాలను ప్రోత్సహించరు. గ్రామాల్లో కొంతమంది యువకులు ఈజీ మనీకి అలవాటు పడి సహజ వనరులపై కన్నేశారు. అక్రమ ఇసుక రవాణా పై వచ్చే ఆదాయంతో వ్యసనాలకు బానిసై, గొడవలకు కారణం అయ్యేవారు.ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల పేర్లు చెప్పుకోవడమే తప్ప..... అందులో వాస్తవం లేదు.
విలేకరి : మండలంలో గంజాయి డ్రగ్స్ దందా,వాడకం ఉందా...!
ఎస్ఐ : గంజాయి, డ్రగ్స్ రవాణా , విక్రయం లేదు. కానీ వివిధ ప్రాంతాల నుంచి నాగారం మండల మీదుగా రవాణా చేస్తున్న క్రమంలో ఇంటలిజెన్స్ సహకారంతో పట్టుకున్నాం.స్థానికంగా ఇలాంటి మత్తు పదార్థాలు వాడిన దాఖలాలు లేవు. అయితే హైదరాబాద్ తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉండే ఇక్కడి కొందరు యువకులు గ్రామాలకు వచ్చినప్పుడు వాడుతున్నట్టు సమాచారం ఉంది. ఇలాంటి వారిపై నిఘా పెట్టాం. కఠిన చర్యలు తీసుకుంటాం.
విలేకరి : నాగారం లాంటి రూరల్ మండలాల్లో ఎలాంటి ఫిర్యాదులు వస్తుంటాయి...!?
ఎస్ఐ : భూ తగాదాలు .... ముఖ్యంగా బాట , గెట్టు పంచాయతీలు ఎక్కువగా వస్తుంటాయి. కుట్రపూరిత క్రిమినల్ నేరాలు తక్కువే. చిన్న చిన్న కొట్లాటలు, న్యూసెన్స్ కేసులే ఎక్కువ.
విలేకరి: మరి "సివిల్
వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దు" అంటూ కోర్టులు ఆదేశిస్తున్నాయి కదా....!?
ఎస్ఐ : నిజమే, కానీ భూమి యాజమాన్య హక్కులు, పొజిషన్ లాంటి విషయాల్లో మేము జోక్యం చేసుకోవడం లేదు. కేవలం చిన్న చిన్న తగువులు ప్రాణాంతకంగా మారకుండా పోలీస్ గైడ్ లైన్స్ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తున్నాం. దీనికి ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తున్నాం. గ్రామాల్లో విద్యావంతులు, పెద్దల సహకారం కూడా ఉంది.
విలేకరి: నాగారం మండలం అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉంది కదా....!? నేరస్తులను ఎలా కంట్రోల్ చేస్తున్నారు....!?
ఎస్ఐ: నిజానికి పుట్టుకతో ఎవరూ నేరస్తులు కాదు. పెరిగిన వాతావరణం, అవగాహనలోపంతోనే నేరాల బాట పడుతుంటారు. ఇక్కడ కరుడుగట్టిన నేరస్తులు పెద్దగా లేరు. క్షణికావేశంలో జరిగిన గొడవలే తప్ప , కుట్ర కోణం లేదు. రాజకీయ కక్షలు అంతకన్నా లేవు. అయినా నేరస్తులను ఉపేక్షించం. ఎప్పటికప్పుడు బైండోవర్లు చేస్తూ.... కౌన్సిలింగ్ ఇస్తూ.... "జీవితాలను నాశనం చేసుకోవద్దు" అంటూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు పటిష్ట వ్యూహం అమలు చేస్తున్నాం.
విలేకరి: పొలిటికల్ ప్రెజర్ ఎలా ఉంది....!? ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడిని ఎలా మేనేజ్ చేస్తున్నారు....!?
ఎస్ఐ: ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు. విధి నిర్వహణలో ఉన్నతాధికారులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నిష్పక్షపాతంగా డ్యూటీ చేయడానికి ప్రజా ప్రతినిధులు పూర్తిగా సహకరిస్తున్నారు.
విలేకరి: ఓ సివిల్ వివాదంలో మీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి కదా....!?
ఎస్ఐ: వాస్తవాలు వెలుగులోకి వచ్చినాక.... అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి. విధి నిర్వహణలో ఇవన్నీ సహజమే.
విలేకరి: ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సహకారం ఉంది...!?
ఎస్ఐ : ముఖ్యంగా జిల్లా ఎస్పీ నరసింహ గారు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. ముందస్తుగా పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట. మాకు మంచి మార్గదర్శి. డిఎస్పి సునిశిత పరిశీలన కలిగిన వ్యక్తి. ఎప్పటికప్పుడు తగిన సూచనలు ,సలహాలు ఇస్తూ గైడ్ చేస్తుంటారు. వీరిద్దరి ద్వారా ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకున్నా. సీ.ఐ కొత్తగా వచ్చారు. ఫుల్ కోపరేటివ్ పర్సన్. ప్రతి సందర్భంలోనూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. తన అనుభవాలను మాతో షేర్ చేసుకొని, సూచనలు ఇస్తారు.వెల్ నాలెడ్జ్ పర్సన్.
విలేకరి: గతేడాది వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో మీకు మంచి పేరు వచ్చింది....!? ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారు....!?
ఎస్ఐ: వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవు . డిపార్ట్ మెంట్ గైడ్ లైన్స్ మాత్రమే పక్కాగా అమలు చేస్తాం. గణేష్ మంటపాల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరి.దీనిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమతుల గురించి గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి, నిర్వాహకులకు తగు సూచనలు చేశాం. విద్యుత్ , పంచాయతీరాజ్ శాఖల తో కలిసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా డిజేలపై పూర్తి నిషేధం విధించాం.
విలేకరి: మిగతా సమయాల్లో డీజే ల వినియోగం విచ్చలవిడిగానే ఉంది కదా...!?
ఎస్ఐ: మీరన్నట్టు పెళ్లిళ్ల సీజన్ లో సమస్య ఉంది. కానీ మా దృష్టికి వచ్చిన ప్రతిసారి కఠినంగానే వ్యవహరిస్తున్నాం. పోలీసులు రోజూ రెండు పూటలా గ్రామాల్లో పర్యటిస్తూ చెక్ చేస్తున్నారు. మద్యం, డీజే ల వల్లే న్యూ సెన్స్ ఎక్కువగా జరుగుతోంది. ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించి , కఠిన చర్యలు తీసుకుంటాం.
విలేకరి: త్వరలో సీఐగా మీ సేవలు మరింతగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఎస్ఐ: మీరు కూడా భవిష్యత్తులోనూ అధికారులకు ఇలాగే సహకరాస్తారని భావిస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్.
About The Author
