రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
లోకల్ గైడ్ చేవెళ్ల (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాదు–బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 21 మంది మృతి, 60 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌తో పాటు ముందుభాగంలో ఉన్న పలువురు ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
ఎలా జరిగింది ప్రమాదం?
బస్సులో ఆ సమయంలో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థలంలోనే మరణాలు – సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
సంఘటనలోనే పలువురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కంకరలో ఇరుక్కుపోయినవారిని జేసీబీల సాయంతో బయటకు తీసేందుకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
ట్రాఫిక్ స్థంభనం – పోలీసులు వేగవంత చర్యలు
ఈ ప్రమాదంతో చేవెళ్ల–వికారాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాల వరుసలు ఏర్పడగా, పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.
కారణం ఏమిటి?
టిప్పర్ లారీ అతివేగం మరియు అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
