బడి బయట బాల్యం..
కూలీలుగా చిన్నారులు చదువులకు దూరం
చట్టాలు బలంగా ఉన్న.. అమలు ఎక్కడ..?
మెదక్ లోకల్ గైడ్ ప్రతినిధి
బడి ఈడు పిల్లలు అంటే పాఠశాలకు వెళ్లే పిల్లలు బడిలోనే ఉండాలి. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు.. తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని, చదువుకోవాలని నిర్బంధ విద్యా హక్కు చట్టం చెబుతోంది. పాఠశాల అనేది పిల్లల సామాజిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన ప్రదేశం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పుస్తకాలు, యూనిఫాంలు ఇతర అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తోంది. ప్రభుత్వం ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బడి బయటనే బాల్యం మగ్గుతోంది. పలక, బలపం పట్టాల్సిన చిట్టి చేతులు పలుగు పార, స్పానర్లు చేత బడుతున్నాయి. అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు కఠినమైన కార్మిక వ్యవస్థలోకి వెళ్తున్నారు. జిల్లాలో ఎంతో మంది చిన్నారులు ఇలా బడి బయటనే మగ్గిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో 'బడి పిలుస్తోంది' అనే పేరు ఉండేది. ఈ కార్యక్రమం ద్వారా సమగ్ర శిక్ష అధికారులు ఈ పిల్లల్ని బడిలో చేర్పించేలా చర్యలు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కనిపించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా లో బడి బయట పిల్లల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో . హోటళ్లలో ఇటుక బట్టీలలో చాలా మంది బడి ఈడు పిల్లలు కనిపిస్తున్నారు. ప్రభుత్వ బడులు నాణ్యమైన విద్య నాణ్యమైన మధ్యాహ్న భోజనం అన్ని రకాల సౌలతో ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్తున్న.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందించడం తోపాటు అన్ని రకాల సౌలతో పాఠశాలలు ఏర్పాటు ఇస్తున్నాయి . అయినా పేద కుటుంబాలకు ఇప్పటికీ కూడా రేక్కాడితే కానీ డొక్కాడని చిన్నారులు బడి బయటే కూలి పనులు చేసుకొని పొట్ట గడుపుకుంటున్నారు.
కూలీలు మారుతున్న చిన్నారులు:
ప్రతి రోజు గంట మోగగానే పుస్తకాలు మోస్తూ బడికి వెళ్లాల్సిన పిల్లలు.. కోడి కూయగానే చేతిలో పని ముట్లు తీసుకుని బయలుదేరుతున్నారు. ఇటుక బట్టీలు, కూలి పనులు, వ్యాపారుల, చెత్తకుండీల వద్దే బాల్యం మొత్తం మగ్గుతోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చిన్న తనం నుంచే కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో సుత్తెలు, తట్టలు, భుజా నికి సంచులు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలతో పనులు చేయించవద్దని వారి చిట్టిచేతులు చక్కని రాతలు రాయాలి కాని సుత్తెలు, తట్టలు మోయవద్దని ప్రభుత్వం నిర్బంధ విద్యను చేపడుతోంది. ఎవరైన చిన్నపిల్లలను పనులలో పెట్టుకుంటే శిక్షలు వేస్తామని చెబుతున్నా ఇది ఆగడం లేదు. మరోవైపు కొన్ని చోట్ల చిన్నారులతో భిక్షాటనలు కూడా చేయిస్తున్నట్టు కనిపిస్తోంది. పనికి వెళ్తే.. రోజు రెండు మూడు వందలు కూడా రావు. అది భిక్షాటన చేయిస్తే.. ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందనే ఆలోచనలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వ చర్యలు ఇటీవల కనిపిం చడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకు రావడానికి విద్యాశాఖ, కార్మిక శాఖ, పోలీసులు సంయుక్తంగా పని చేయాల్సి ఉంది. అయితే కరోనా తర్వాత ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. చాలా మంది తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లడంతో పిల్లల చదువు మధ్యలోనే మాన్పించేస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు పనిచేసే చోటే ఉంటూ బడికి దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది కూడా ఎక్కడా కనిపించడ లేదు. జిల్లాలో ఎక్కువగా ఇటుక బట్టీలు, ఇనుప వస్తు వుల తయారీదారులు, మెకానిక్ షెడ్లు, రోడ్డుసైడ్ వ్యా పారం చేసే వారి వద్ద హోటళ్లలో, మరికొందరు గ్రామీ ణప్రాంతాల్లో పంటలు కోయడానికి వెళ్తున్నారు. 2009 లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందివ్వాల్సి ఉంది. కానీ లక్ష్యాన్ని చేరుకోవ డంతో ఎస్ఎస్ఎ విఫలమవుతోంది. బాలకార్మిక వ్యవ స్థాను నిర్మూలించి, వీధిబాలలు, వలస పిల్లలను చేరదీసి వారితో అక్షరాలు దిద్దించాలన్నది మాటలకే పరిమిత మవుతోంది. ముఖ్యంగా ఇలా బాల కార్మిక వ్యవస్థ పోవాలంటే ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాల్సి ఉంది. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంతో మంది చిన్నారులు.. బడి బయట భారంగా బతుకీడ్చక తప్పదు.