ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి



ఖమ్మం (లోకల్ గైడ్); ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పీ శ్రీజతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధాన పర్చాలని, మన పరిధిలో చెయ్యాల్సిన పనిని వెంటనే పూర్తి చేయాలని, మనం చేయలేని పక్షంలో దానికి గల కారణాలను, నిబంధనలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని సూచించారు. బోనకల్ మండలం చిరునోముల గ్రామానికి చెందిన నిమ్మతోట నాగయ్య తనకు నాగార్జునసాగర్ కాలువ బోనకల్ బ్రాంచ్ పరిధిలో 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందని, ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా లష్కర్ గా నియామకం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఇరిగేషన్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమీషన్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డీలర్లకు కమీషన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)కు రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు దొండపాటి రమేష్ మార్క్ ఫెడ్ ద్వారా ఖరీఫ్ పెసర పంటను కొనుగోలు చేయుటకు ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డీఎం మార్క్ ఫెడ్ కు రాస్తూ కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొణిజెర్ల మండలం తనికెళ్ళ గ్రామానికి చెందిన ప్రజలు తనికెళ్ళ గ్రామం నుంచి బోడ్యా తండా గ్రామానికి వెళ్లే డొంక రహదారి ఆక్రమణకు గురవుతుందని, డొంక రహదారికి ప్రభుత్వం సర్వే చేసి అభివృద్ధి చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు రాస్తూ చర్యలు చేపట్టాలని అన్నారు. ఖమ్మం నగరం గాంధీ చౌక్ కు చెందిన రేపాల వెంకటరావు, నూతన రైల్వే 3వ  లైన్ కొరకు తన ఇంటి స్థలం 24 గజాలు తీసుకొని రూ 25 లక్షల నష్టపరిహారం చెల్లించారని, లూప్ లైన్ కొరకు మరో 17 చదరపు గజాలు జూలైలో తీసుకున్నారని, దీనికి నష్టపరిహారం రూ 17 లక్షలు తక్షణమే చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు రాస్తూ రైల్వే శాఖతో సమన్వయం చేస్తూ త్వరగా నష్టపరిహారం చెల్లించేలా చూడాలన్నారు. ఖమ్మం నగరానికి చెందిన యనమందల కృష్ణ బాబు తన కుమారుడు తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్నాడని, తన కోడలికి అమరవీరుల కుటుంబానికి అందించే ప్రభుత్వ ఉద్యోగం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డీ ఆర్ వో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్. ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో డీ ఆర్ వో ఏ పద్మశ్రీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News