సినారె సాహిత్య ప్రదీప్తి... జ్ఞాన వీచిక
నష్టపరిహారం ఇప్పించిన బీజేపీ నాయకులు..మహేష్ యాదవ్
విశ్వ కవిగా పేరు పొందిన మహాకవి డా. సి.నారాయణ రెడ్డి సాహిత్యంపై అనేక పత్రికలలో కవి, విమర్శకులు డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు 'జ్ఞాన వీచిక' సంకలనంగా వెలుగులోకి వచ్చాయి. ఈ సంకలనంలో మొదటగా 'స్మృతి వనం'లో సినారెతో మొదలు పెట్టి 'నా రణం మరణంపైనే' వరకు 25 వ్యాసాలను పొందుపరిచారు. సినారె గేయం, పద్యం, సంగీతం, రూపకం, కథకావ్యం, వచన కవిత్వం, గజల్ పాటలు, వ్యాకరణ రచన, నాటిక, వ్యాసం, పరిశోధన, సంభాషణ, వ్యాఖ్యానం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలలో తనదైన శైలిలో చూపిన ప్రజ్ఞ పాటవాలను ఈ వ్యాసాలు ఆవిష్కరించాయి. ప్రపంచ పదులలో సినారె 'కాగితాలెన్నెన్ని పితికితె కవిత ఒలికెను చుక్కలా' అన్నట్టు ఈ వ్యాసాలలో సినారెలోని నిశిత కవితా దృక్పథం కనిపించింది. 'ఎన్నిసార్లు చెక్కితే ఓ శిల్పం ఎన్నిసార్లు తీర్చితే ఓ చిత్రం కబుర్లు చెప్పకే ఓ కాలమా ఎన్నిసార్లు చస్తే ఓ జీవితం' అని ఆయనే అన్నట్టు కవిగా సినారె అంతరంగ మధనాన్ని ఈ వ్యాసాలు చిత్రిక పట్టాయి. అమ్మ జోలపాడినట్లు, నాన్నమ్మ యుద్ధనీతి కథలు చెప్పినట్లు సినారి రచన వ్యాసంగం సాగిన తీరును వ్యాసాలు ఉదాహరించాయి. మానవ జన్మ సార్థకానికై పట్టుదలతో ముందుకు పోవాలన్న సినారె లక్ష్యాన్ని వివరించారు. కవితారోహణంలో 'ఒడ్డు చేరిన వాడికే లోకం వొంగి సలాం కొడుతుంది వాలుకు కొట్టుకు పోతే కాలం జలసమాధి కడుతుంది' అన్న పంక్తుల విశ్లేషణ ఇందులోని ఒక వ్యాసంలో వివరణాత్మకంగా ఉంది. 'ఈ సృష్టిలో గెలుపే ప్రధానం' అన్న కవి సూచనలోని లోతును గమనించమన్నారు. 'ఒళ్ళంతా కన్నీళ్ళయిన జీవితం' పట్ల కనబరిచిన దాంట్లో అన్న సినారె కవితా వ్యక్తిత్వాన్ని, సాహిత్య కృషికి కవితా కృషికి ఉదాహరణలుగా నిలిచే కవితా ఖండికలను వ్యాసాలలో ప్రస్తావించారు. తెలుగు చిత్రసీమలో గీత రచయితగా తనదైన ముద్ర వేసిన సినారెకు ఎంతో పేరు తెచ్చిన పాటలను విశ్లేషించారు. దాదాపు మూడు వేల ఐదు వందల సినిమా పాటలు రాసిన కవిగా ఆయన గొప్పతనం ఏమిటో చెప్పారు. 'నా రణం మరణంపైనే' సంపుటిలో 'తొలి ఊపిరి జననం, తుది ఊపిరి మరణం' అన్న సినారె లోని తాత్విక దృష్టిని వ్యాసాలు తెలిపాయి. జీవించినంత కాలం నిత్యం ప్రజలను చైతన్య పరుస్తూ ఉండాలంటూ 'ఉప్పు మని ఊదితే పోయే ఆశలకు ఎందుకంత ఆరాటం' అంటారు సినారె. 'బలమైన సంకల్పం ఉంటే వెన్ను పూసలు ఎదురు దెబ్బలకు వంగిపోవని' తెలియజేశారు సినారె. 2011లో సి. నారాయణరెడ్డి 81వ జన్మదిన సందర్భంగా ప్రచురితమైన 'నా చూపు రేపటి వైపు' అన్న కవితా సంపుటిలోని కవితలను చదివితే ఎంత ఆలోచనత్మాకత ఆయనలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 'సమయం దాటి పోయిందంటాం, సమయం దాటిపోదు, మనమే వెనకబడిపోతాం' అని ఎంతో గొప్పగా రాసిన సినారె సాహిత్యానుశీలతను ఇందులో వ్యాసాలు ప్రస్ఫుటపరిచాయి. సినారె లోని విశ్వ మానవతా కవితా వ్యక్తిత్వానికి ఈ వ్యాసాలు నిలువుటద్దాలుగా నిలిచాయి.
(జ్ఞాన వీచిక - సాహిత్య విమర్శా వ్యాసాలు)రచయిత : డా. తిరునగరి శ్రీనివాస్,వెల రూ. 100, ప్రచురణ : చేయూత పబ్లికేషన్స్ : ప్రతులకు :- అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు, ఫోన్ : 9441464764
-- మిద్దె సురేష్
కవి, వ్యాసకర్త
9701209355
About The Author
Related Posts
