పోస్ట్ మ్యాన్ లపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు
-అపార్టుమెంట్ లలో ప్రవేశానికి అనుమతించాలి
-రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లకు సూచనలు-ప్రభుత్వ సిబ్బందిని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు
-సర్క్యులర్ జారీ చేసిన జిహెచ్ఎంసి కమీషనర్
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాల శాఖకు చెందిన సిబ్బందికి ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని గ్రేటర్ కమీషనర్ ఆర్ వి కర్ణన్ సూచించారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ లేఖను అనుసరించి గ్రేటర్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో పోస్టల్ డిపార్ట్మెంట్ డెలివరీ సిబ్బంది ఉత్తరాలు బట్వాడా చేయడానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమీషనర్లను ఆదేశించారు. ఇవి తక్షణమే జరిగేలా పర్యవేక్షించాలని జోనల్ కమీషనర్ లకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎత్తైన అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలలో తపాల శాఖకు చెందిన ఉత్తరాలు, పార్సెళ్లు డెలివరీ చేయడానికి పోస్ట్ మ్యాన్ లను లోపలికి అనుమతిం చకుండా పలు ఆంక్షలు విధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తపాల సిబ్బందిని సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడం, సర్వీస్ లిఫ్ట్ లను మాత్రమే ఉపయోగించమని బలవంతంచేయడం, డెలివరీ వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి అనుమతించకపోవడం లాంటి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొ న్నారు. డెలివరీ చేయని వస్తువులను పర్యవేక్షించకుండా వదిలివేయాలని బలవంతం చేయడం, డెలివరీ సిబ్బందికి ఆలస్యం చేయడం, అసౌకర్యం కలిగించడం, ముఖ్యమైన ప్రభుత్వ, వ్యక్తిగత సమాచారాన్ని సకాలంలో అందించడంలో ఇలాంటి ఆంక్షలు ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లకు అవగాహన కల్పించి ఖచ్చితంగా పాటించేలా చూడాలని డిప్యూటీ కమీషనర్ లను గ్రేటర్ కమిషనర్ ఆదేశించారు.అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో పోస్ట్ ఆఫీస్ యాక్ట్-2023 ప్రకారం అనుమతించబడిన లెటర్ బాక్స్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే భారతీయ న్యాయ సంహిత- 2023 చట్టంలోని సెక్షన్ 221 ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కొన్నారు.
About The Author
