ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో జిల్లా కారాగారంలో ప్రత్యేక వైద్య శిబిరం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఆదేశాల మేరకు జిల్లా కారాగారంలో ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నీలగిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో, జిల్లా కారాగారం పర్యవేక్షణ అధికారి కూన ఆనందరావు అధ్యక్షతన, కారాగార వైద్య అధికారి డాక్టర్ సట్టు కిరణ్ కుమార్ సారథ్యంలో జరిగింది. ఈ శిబిరంలో ఖైదీలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేశారు.
ఈ సందర్భంగా జనరల్ ఫిజీషియన్, ఆప్తల్మాలజిస్ట్ (కంటి వైద్యులు), మానసిక వైద్యులు, ఈ ఎన్ టి నిపుణులు, ఎముకల వైద్యులు (ఆర్థోపెడిక్ వైద్యులు), స్త్రీల వైద్య నిపుణులు (గైనకాలజిస్టులు) ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా నిర్వహించబడినవి.
ఈ వైద్య శిబిరంలో డా. సుబ్బారావు (మానసిక వైద్యుడు), డా. వి. వినోద్ కుమార్ ( ఈ ఎన్ టి నిపుణుడు), డా. పుల్లారావు (కంటి వైద్యుడు), డా. రమేష్ (క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ & ఫిజీషియన్), డా. శంకర్ (ఫిజీషియన్), డా. విశ్వజ్యోతి (స్త్రీల వైద్య నిపుణులు), డా. రామచంద్ర (ఆర్థోపెడిక్ వైద్యుడు), డా. జి. ప్రవీణ్ (జనరల్ సర్జన్), డా. భరద్వాజ్ (డెంటల్ సర్జన్), డా. వంశీ (డెంటల్ సర్జన్), డా. శ్రీవాస్తవ (ఫిజీషియన్) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా కారాగారం జైలర్ శ్రీ బాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సమన్వయంతో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్లు వెంకట్ రెడ్డి, సుబ్బరాజు, మెడికల్ సిబ్బంది సీతారామ్, లింగయ్య, అలాగే పోలీసు సిబ్బంది సైదులు, గిరిబాబు, సురేష్, రాంబాబు, కర్ణాకర్, శ్రావణ్, జయప్రకాష్ రెడ్డి, గణేశ్, శ్రీకాంత్ కోటి తదితరులు పాల్గొన్నారు.
ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
