సబ్బండ వర్గాల అభివృద్ధియే ప్రజాప్రభుత్వం ప్రధాన ధ్యేయం.
బాసరలో విశ్వ విద్యాలయ ఏర్పాటుకు చర్యలు. సదర్మాట్ బ్యారేజికి పి. నర్సారెడ్డి పేరు పెడతాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
నిర్మల్ : లోకల్ గైడ్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నూతన రేషన్ కార్డులు అందివ్వడంతోపాటు, ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి ఎన్నో రకాల పథకాలతో రాష్ట్ర ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, మహిళా సంఘాల సభ్యులను వెయ్యి బస్సులకు యజమానులను చేశామని గుర్తు చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని హైదరాబాద్ నడి బొడ్డున మహిళా సంఘాలకు కేటాయించి, వారి ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా ప్రజల కోరిక మేరకు బాసరలో యూనివర్సిటీను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తామని వెల్లడించారు. ఇండ్లు లేని పేదలకు నిలువ నీడ కల్పించేందుకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని అన్నారు. రైతులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడను నెలకొల్పుతామని చెప్పారు. దీని ద్వారా జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాతో సమానంగా నిర్మల్ జిల్లాకు నిధులు కేటాయించి జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనక కొరాట, సదర్మాట్ బ్యారేజీల ద్వారా వీడు భూములు సస్య శ్యామలమవుతాయని తెలిపారు.
అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా సంఘాలకు రుణాల చెక్కులను ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లు కలిసి అందించారు. నిర్మల్ ఉత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు.
రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తాం.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.
రాష్ట్రంలోని రైతాంగానికి సంపూర్ణంగా సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సాగునీరు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని ఆధునికరిస్తామని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మిగిలి ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదవారికి అందరికీ నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు:
జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేదల ఉన్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇల్లు లేని పేద వారందరికీ సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు.
అంతకుముందు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఆధునీకరించాలని కోరారు. నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని తెలిపారు. జెడ్పి భవన నిర్మాణం తో పాటు, రోడ్లు, వంతెనల నిర్మాణాలు మరమ్మత్తులు చేయాలని చెప్పారు. నిర్మల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన మేర నిధులు కేటాయించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విటల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, పవార్ రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
