హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): వాహనంపై చలాన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమానుల బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని, వాటిని రవాణా శాఖ వ్యవస్థతో సింక్ చేయాలని, తద్వారా చలాన్ పడగానే డబ్బులు స్వయంచాలకంగా కట్ కావాలని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై ప్రజలలో విస్తృత చర్చ మొదలైంది. ట్రాఫిక్ నియమాల అమలుకు కఠిన చర్యలు అవసరమేనని కొందరు భావిస్తుంటే, మరోవైపు ప్రభుత్వ పరిపాలనలో ఉన్న మౌలిక లోపాలను ముందుగా సరిదిద్దాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల వాదన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లు సక్రమంగా లేవు. గుంతలతో నిండిన రోడ్లపై వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా సరైన చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యమవు తున్నాయని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో వారు ఆర్థికంగా కష్టాలలో పడుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నడిపేది ప్రజలే. అలాంటి ప్రజలకే అదనపు భారాలు మోపితే ఎలా? ముందుగా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను సరిచేసి, ప్రజలకు రావాల్సిన న్యాయం, హక్కులు కల్పించాలి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. శిక్షల కంటే సౌకర్యాలు, క్రమశిక్షణ కంటే ముందు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజాభిప్రాయం వ్యక్త మవుతోంది. మొత్తంగా చలాన్ వ్యవస్థను మరింత కఠినంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఒకవైపు ఉంటే, మరోవైపు పరిపాలనలో ఉన్న సమస్యలను పరిష్కరించ కుండా ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పెంచడం సమంజసమేనా? అన్న ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ముందుగా ప్రజలకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యోగ విరమణలు చేసిన వారికి ఉద్యోగ విరమణ పొందిన రోజే అందజేయాలని ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుచున్నారు