శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, ఏ బ్లాక్‌లో గల శ్రీరామ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఈ. వెంకటేశ్వర్లు నూతన గృహంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలలో భాగంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. సంక్రాంతి వేడుకలను నిర్వహించిన ప్రిన్సిపాల్ ఈ. వెంకటేశ్వర్లు కు కార్పొరేటర్ అభినందనలు తెలిపారు. అలాగే ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులకు, స్కూల్ పిల్లలకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్పొరేటర్ హమీద్ పటేల్, చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలుసుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించడం, వారి మాటను పాటించడం, మంచి విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు కలిసి కార్పొరేటర్ హమీద్ పటేల్ ని శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తిరుపతి యాదవ్, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.