రికవరి చేసిన మొబైల్స్ అందజేసిన జిల్లా ఎస్పీ
గద్వాల, లోకల్ గైడ్ :
మొబైల్ ఫోన్ యజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే చింతించవద్దని, తక్షణమే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ సిబ్బంది రికవరీ చేసి అప్పగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో సెల్ పోన్ యజమానులు పోగొట్టుకున్న 52 సెల్ పోన్ లను జిల్లా ఎస్పీ గురువారం సెల్ పోన్ యజమానులకు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైన తమ మొబైల్స్ దొంగతనం జరిగిన, పోగొట్టుకున్న చింతించాల్సిన అవసరం లేదన్నారు. అలాగని అజాగ్రత్తగా ఉండకూడ దన్నారు. దొంగతనం, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 853 సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయగా, ఇందులో 413 సెల్ ఫోన్లను గుర్తించి అందులో ఇప్పటి వరకు 260 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న, దొంగిలించబడిన వెంటనే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి, సంబందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మొగిలయ్య, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.