గౌతంనగర్ లో కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన
పఠాన్ చేరు నియోజకవర్గంలోని పఠాన్ చేరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ పనులకు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాలనీల్లో సదుపాయాలు కల్పించడం మా ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాం. ప్రతి కాలనీలో ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాళ్లు, పార్క్ లు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి వంటి పనులను ప్రాధాన్యతనిస్తూ చేస్తున్నాం. గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రజలకు వివిధ రకాల కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక కోటి రూపాయలు కేటాయించాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాలనీలో చాలా కాలంగా కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది. మా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రజల డిమాండ్‌ను వెంటనే గుర్తించి నిధులు మంజూరు చేయడం అభినందనీయం అని, ఈ హాల్ వల్ల కాలనీ ప్రజలకు చాలా సౌకర్యం లభిస్తుంది అని అన్నారు. స్థానిక కాలనీ వాసులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మా కాలనీలో ఇప్పటివరకు చిన్న సమావేశాలు, సామాజిక కార్యక్రమాలకు సరైన ప్రదేశం లేక ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ రావడం వల్ల మాకు చాలా ఉపశమనం లభించింది అని గౌతమ్ నగర్ నివాసులు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.