ఖమ్మం జిల్లా,కారేపల్లి: లోకల్ గైడ్, ఏప్రిల్ 07 :
సింగరేణి మండలం విజేత మండల మహిళా సమాఖ్య పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన ఋణాలలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు రమణ, బండి పద్మ, మండల కార్యదర్శి కొండబోయిన ఉమావతి లు డిమాండ్ చేశారు. గ్రామాల్లో డ్వాక్రా మహిళల సమస్యలపై ఐద్వా మంగళవారం సర్వే నిర్వహించింది. డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్న మహిళలకు తెలియకుండానే స్త్రీనిధి, లింకేజీ రుణాలు రూ. లక్షలను విజేత మండల సమాఖ్య లోని వివిధ స్ధాయి సిబ్బంది కాజేశారని సర్వేలో బాధిత మహిళలు తెల్పినట్లు ఐద్వా నేతలు తెలిపారు. మొట్లగూడెంలో వినాయక్, స్వరాజ్ గ్రూపులతో పాటు ఇతర గ్రామాలలోని గ్రూపులో గ్రామంతో సంబంధం లేనివారి పేర్లను చేర్పించి, గ్రామ దీపిక(బుక్ కీపర్), వెలుగు సీసీ, సిబ్బంది, ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ లక్షల రూపాయల అవినీతి పాల్పడ్డట్టు తమ సర్వేలో మహిళలు తెలిపారన్నారు. ఋణాలతో సంబంధం లేని మహిళల పేర్లతో బ్యాంకులో బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేసి వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అక్రమాలపై ఉన్నత అధికారులు విచారణ పేరుతో ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం తప్ప సమస్య పరిష్కారం కావటం లేదని వారు ఆరోపించారు. సింగరేణి మండలంలో మహిళ స్వయం సహాయక సంఘాల రుణాలలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటంలో జాప్యం జరుగుతుందని ఇది సహించరానిదని ఐద్వా నేతలు అన్నారు. తప్పుడు గ్రూపును తయారు చేయడం, గ్రామానికి సంబంధం లేని సభ్యులను గ్రూపులో ఉంచటం, గ్రామ సమాఖ్య సభ్యులకు తెలియకుండా తీర్మానాలను చేయడం లాంటి అక్రమచర్యలు స్పష్టంగా కనపడుతున్నా విచారణ, రికవరీలు పేరుతో అక్రమార్కులపై చర్యలకు కాలయాపన చేయడం సరికాదన్నారు. జిల్లా పిడి, ఇతర జిల్లా అధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టాలన్నారు. ఐద్వా చేపట్టిన సర్వేలో మండల వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన అంశాలపై బాధిత మహిళలను సమీకరించి ఆందోళన చేస్తామని ఐద్వా నేతలు హెచ్చరించారు.