జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి...... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మారుతున్న సాంకేతికత కు అనుగుణంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో పెట్టాలి.
నూతన భవనం, ప్రహరీగోడ నిర్మాణం సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలి. ఖమ్మం నగరం బస్ డిపో రోడ్ లోని డిస్ట్రిక్ లైబ్రరీ లో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ఖమ్మం, మార్చి - 25 :లోకల్ గైడ్ :
జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
అనంతరం గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్ లలో తిరుగుతూ కావాల్సిన వసతుల అవసరాలను కలెక్టర్ గుర్తించారు. అక్కడ ఉన్న పాఠకులతో, పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. ఏ పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు, ఎటువంటి పుస్తకాలు కావాలి, ఏమైనా అవసరాలు కావాలా వివరాలు అందిస్తే పది రోజుల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన లైబ్రరీ అదనపు భవనం, నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అన్నారు. అభ్యర్దులు, విద్యార్థులకు అనువైన అధునిక వసతులతో చేపట్టిన నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 
గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతి సంవత్సరం అప్ డేట్ అయిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పుడు పాతవి మార్చాలని, పాఠకులు యువకులతో చర్చించి పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు ప్రతి విభాగం వారీగా అవసరమైన పుస్తకాల జాబితాను తయారు చేసి వెంటనే అందించాలని కలెక్టర్ గ్రంథాలయ నిర్వాహకులకు సూచించారు.
గ్రంథాలయంలో వివిధ రకాలైన పుస్తకాలు అన్ని రంగాల్లో రాణించే విధంగా కృషి చేసేందుకు దోహదపడుతాయని అన్నారు. కొత్త రకం ఛాలెంజ్ తో ప్రాక్టికల్ లర్నింగ్ ద్వారా ఆలోచన శక్తి పెంపొందించి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయని తెలిపారు. లైబ్రరీ లోని పలు వార్తాపత్రికలు, సాహిత్యంతో విజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థులు, యువత గ్రంథాలయాల సేవలను ఉపయోగించుకుని తమ భవిష్యత్తును గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులు, యువత విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా, అదే సమయాన్ని గ్రంథాలయంలో గడపడం ద్వారా కొత్త కొత్త విషయాలు, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది భాస్కర్ రావు, అఖిల్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
