కొమరం భీమ్ ఆదివాసి మహిళ సొసైటీలో అనేక అక్రమాలకి చోటు
రేసింగ్ కాంట్రాక్టర్ చెప్పుచేతల్లో నడుస్తున్నారని జీ ఎస్ పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆరోపణ
కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ టీజీ ఎండీసీ పీవో, డీసీవో ఆన్లైన్ పెట్టడంలో ఆంతర్యం ఏమిటో..?
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండలం కేంద్రంలో తుడుం దెబ్బ కార్యాలయంలో ఆదివాసి సీనియర్ నాయకులు వాసం ముసలయ్య అధ్యక్షతన ఆదివారం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ సుబ్బంపేట పంచాయతీ బీఎస్ రామయ్య నగర్ కాలనీ శ్రీ కొమరం భీమ్ ఆదివాసి మహిళ ఇసుక సొసైటీలో మొదటి నుండి అనేక అవినీతి ఆరోపణలు స్పష్టంగా కనబడుతున్నాయని, ఆ అవినీతిపై మెజార్టీ సభ్యత్వం గల సభ్యులు టీజీఎండీసీ పీవోకి, డీసీవో కి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేసినప్పటికీ అవినీతిపరులకే సంబంధిత శాఖ అధికారులు అందలం ఎక్కిస్తున్నారని, అభరాశి బండల దగ్గర ఒక లక్ష క్యూబిక్ మీటర్లకు మంజూరు చేసిన పాయింటు దగ్గర ఇసుకను డంపు చేయకుండా, శ్రీరామ సొసైటీ ప్రక్కన, ఇసుకను తోడి డంపు చేసి, అక్రమంగా ఆన్ లైన్ చేస్తున్నారని, శ్రీరామ సొసైటీ ఆ కమిటీలో ఉన్న కొంతమందిని కొమరం భీమ్ సొసైటీలో చేర్చుకొని, రేసింగ్ కాంట్రాక్టర్ చెప్పుచేతల్లో నడుస్తున్నారని, జీ ఎస్ పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆరోపించారు. శ్రీ కొమరం భీమ్ ఆదివాసి మహిళా ఇసుక సొసైటీలో అవినీతిపై కమిటీ సభ్యులు ఫిర్యాదు చేస్తే తక్షణమే నిలుపుదల చేస్తానని, టీజీఎండిసి పిఓ చెప్పిన మాటలు మర్చిపోయి, అక్రమంగా ఆన్లైన్ పెడుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారని, ఆదివాసుల పక్షాన ఆదివాసి సంఘాలు నిరంతరం పోరాటం చేస్తా ఉంటే ఆదివాసి సంఘాల ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోని టీజీ ఎండిసీ పిఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆదివాసులకు అన్యాయం చేసే విధంగా ఉన్నారని అన్నారు. ఈ విషయంపై హైదరాబాద్ టీజీఎండిసి ఎండికి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల జీ ఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్, కలం శ్రీనివాస్, మడప అనిల్, శరేం అరవింద్, మడివి సునీల్, మడివి ఉంగ తదితరులు పాల్గొన్నారు.
