నాణ్యమైన ఆహారాన్ని తాజాగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు.....
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులుగా నియమించి, వారానికి ఒకసారి సంక్షేమ హాస్టళ్ళ తనిఖీకి ఆదేశాలు
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లలో భోజన నాణ్యతపై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్లోకల్ గైడ్: ఖమ్మం:
ఖమ్మం జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్ లలో నాణ్యమైన ఆహారాన్ని తాజాగా విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో వివిధ సంక్షేమ శాఖలచే 122 రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో సుమారు 13 వేల 876 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉచిత విద్యతో పాటు వసతి పొందుతున్నారని కలెక్టర్ అన్నారు. ఇందులో బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఎస్సి సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలలు/కళాశాలలు నిర్వహించబడుతున్నాయన్నారు. ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు.జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పకడ్బందీ కార్యాచరణ చేశామన్నారు. రోజూ రెండు అల్పాహారాలు, సన్న బియ్యంతో వండిన అన్నంతో కలిపి ఏడు రకాల పదార్థాలు, గుడ్డు, నెలకు ఆరుసార్లు మాంసాహారంలతో విద్యార్థులకు సంపూర్ణ భోజనం అందించేలా ప్రభుత్వం మెనూ అమలు చేస్తుందన్నారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
సంక్షేమ హాస్టళ్ళలో భోజనం, వసతి పర్యవేక్షణ కు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా కేటాయించామన్నారు. ప్రత్యేక అధికారులు, వారి పరిధిలోని సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, అక్కడి ప్రాంగణంలో పాటిస్తున్న పారిశుద్ధ్య చర్యలు, పిల్లలకు వండుతున్న ఆహార పదార్థాలు, కూరగాయల నాణ్యత, త్రాగునీటి సరఫరా, వంట ప్రదేశం పరిసరాలు, కిచెన్ రూమ్ లో పరిశుభ్రత, మెనూ ఎలా పాటిస్తున్నారో వంటి పలు అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారని కలెక్టర్ అన్నారు. వారానికి ఒకసారి ప్రత్యేక అధికారులు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, విద్యార్థులతోనే భోజనం చేసి, భోజనం నాణ్యత, మెరుగైన సదుపాయాల కల్పనకు చేపట్టాల్సిన చర్యలు, సమస్యలపై నివేదిక సమర్పిస్తారన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, బయటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోకి అనుమతించడం లేదని, ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూ ప్రకారం శుచికరమైన, రుచికరమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
About The Author
Related Posts
