సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి19:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన "ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు" కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉద్యానవన, మత్స్య, పట్టుపరిశ్రమ, విత్తనాభివృద్ధి, చేనేత & జౌళి శాఖలతో పాటు వివిధ వ్యవసాయ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు.శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు ద్వారా మంచి ఆదాయం సాధ్యమని తెలిపారు. రైతులు మొదటి సంవత్సరాల్లో అంతర పంటలు వేసుకోవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎకరానికి రూ.4200 సబ్సిడీ అందిస్తోందని, ఆయిల్ ఫెడ్ వద్ద నమోదు చేసుకోవాలని కోరారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కలలు నిజమవుతున్నాయని, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట రైతులకు స్థిర ఆదాయం అందిస్తున్నదని, ఎకరానికి రూ.51 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా మరింత విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నర్మెట్ట ఫ్యాక్టరీలో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.మంత్రి వాకిటి శ్రీహరి పంట మార్పిడి అవసరాన్ని ప్రస్తావిస్తూ రైతులు ఆదాయపరమైన పంటలను ఎంచుకోవాలని సూచించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతు ఉత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఫ్యాక్టరీ గంటకు 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు.పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం నాలుగేళ్లపాటు ఎకరానికి రూ.4200 సాయం అందిస్తోందని చెప్పారు.ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు ప్రభుత్వం మరింత ఆర్థిక మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా ఆదర్శ రైతు భాగ్యలక్ష్మి తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం అతిథులు ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించి పనితీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సీలు, అధికారులు, ఆయిల్ ఫెడ్ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.